మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ నేతలు
posted on Mar 18, 2015 @ 11:39AM
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏవిధంగా వ్యవహరించినప్పటికీ చట్టసభల పట్ల ప్రజలలో నెలకొని ఉన్న గౌరవం అలానే నిలిచి ఉంది. కారణం ప్రజాస్వామ్యంపై వారికున్న అపారమయిన నమ్మకం, గౌరవమే. కానీ చట్టసభలలో కూర్చొన్నవారికి మాత్రం అటువంటి మూడ నమ్మకాలు, అపోహలు ఏమీ లేవని పదేపదే నిరూపిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరును చూసి ఆగ్రహం చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “అసెంబ్లీ అంటే మీ ఇడుపులపాయో లేకపోతే మీ లోటస్ పాండో అన్నట్లు ఏమి మాట్లాడినా చెల్లుతుందన్నట్లు వ్యవహరించడం సరికాదు,” అని హెచ్చరించవలసి వచ్చింది. కానీ ప్రజాసమస్యల గురించి మాట్లాడుతుంటే తమకు మాట్లాడే అవకాశం ఈయకుండా అధికార పార్టీ సభ్యులు అడ్డుపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రత్యారోపణలు చేసారు.
రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించిన తరువాత ఇప్పుడు కనీసం అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు కూడా అర్హత కోల్పోయిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల కోసం అంటూ ఇప్పుడు రోడ్ల మీద ధర్నాలు చేసుకొంటూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అధికార తెదేపా పార్టీ ప్రతిపక్ష పార్టీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర అసెంబ్లీని ఒక ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేసిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి మాట్లాడే అవకాశం ఇచ్చినా మాట్లాడేందుకు ఆసక్తి చూపేవారు కాదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన వ్యవహారంలో ఎంత గొప్పగా వ్యవహరించిందో ప్రజలందరికీ తెలుసు. సాక్షాత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన వల్ల వచ్చే కష్టనష్టాల గురించి తన అధిష్టానానికి ఎంతగా వివరించి వారించినా వినకుండా రాష్ట్ర విభజన చేసింది. కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్రమంత్రులు చెప్పిన సలహాలను సూచనలను పెడచెవిన పెట్టింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ లక్షలాదిమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి దాదాపు రెండున్నర నెలలపాటు ఎన్ని ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు.
విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు కిటికీలు, తలుపులు మూసివేసి, టీవీ చానళ్ళ ప్రసారాలు నిలిపివేసి అత్యంత హేయమయిన పద్దతిలో విభజన బిల్లుని ఆమోదింపజేసుకొంది. కానీ ఇవేవీ అప్రజాస్వామికంగా కాంగ్రెస్ నేతలు భావించలేదు. అందుకే వారు ఇంతవరకు ఏనాడు కూడా అందుకు పశ్చాతాపం వ్యక్తం చేయలేదు. కనీసం ఆ ప్రసక్తి కూడా తేలేదు. రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ తదితర కాంగ్రెస్ నేతలు ఏవిధంగా వ్యవహరించారో, అప్పుడు ప్రజలు ఏవిధంగా స్పందించారో అందరికీ తెలిసిన విషయమే.
అటువంటి వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మొసలి కన్నీరు కారుస్తూ రోడ్ల మీద ధర్నాలు చేసినంత మాత్రాన్న రాష్ట్ర ప్రజలు వారు చేసిన తప్పులను మరిచిపోయి క్షమించేస్తారా? ఆనాడు యావత్ దేశ ప్రజలు నివ్వెరపోయేలా పార్లమెంటులో వ్యవహరించిన కాంగ్రెస్ నేతలు, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీని ఒక ప్రైవేట్ లిమెటెడ్ కంపెనీగా మార్చేశారని ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం.