ఏపీ బయటా ఆరోగ్యశ్రీ... ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు జగన్ సూత్రాలు
posted on Oct 19, 2019 @ 10:57AM
వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమంపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఏపీ బయటా... ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ ఒకటి నుంచి ఏపీలోనే కాకుండా... హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో కూడా ఆరోగ్యశ్రీ చికిత్సలకు అనుమతిస్తూ సీఎం జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. అలాగే, పశ్చిమగోదావరిలో 2వేల వ్యాధులకు... మిగతా జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇక, డెంగ్యూ, సీజనల్ వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక, కిడ్నీ రోగులకు ఇస్తున్నట్లే.... తలసేమియా, హీమోఫీలియో, ఎనీమియా పేషెంట్స్‌కు కూడా నెలకు 10వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా, తీవ్ర వ్యాధులుంటే ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఆపరేషన్స్ తర్వాత కోలుకునేంతవరకు ఆర్ధికసాయం అందించాలని నిర్ణయించారు. వీళ్లందరికీ నెలకు 5వేలు లేదా రోజుకి 225 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. అదేవిధంగా 5వేల రూపాయల పెన్షన్ కేటగిరిలోకి పక్షవాతం, కండరాల క్షీణతలాంటి మరో నాలుగు వ్యాధులను చేర్చారు.
వైద్యారోగ్యశాఖలో మొత్తం ఖాళీలను భర్తీ చేస్తామన్న సీఎం జగన్.... హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది జీతాలను 16వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కొత్తగా 108, 104 వాహనాలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక, ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధికి కార్యాచరణ రూపొందించడంతోపాటు, ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రం ఏర్పాటు.... కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ 21నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తామని తెలిపిన వైఎస్ జగన్.... కంటి వెలుగు మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, గిరిజన, మారుమూల ప్రాంతాల్లోనూ బైక్స్ ద్వారా వైద్యసేవలు అందిచేందుకు చర్యలు చేపడతామన్నారు. మొత్తంగా ఆరు సూత్రాల అజెండాతో రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.