ఆర్టీసీ మరో ఆల్విన్ కాకూడదు... కార్మికులతో చర్చల ప్రసక్తే లేదన్న కేసీఆర్
posted on Oct 23, 2019 @ 11:59AM
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత కఠిన వైఖరి ప్రదర్శించారు. ఆర్టీసీ సమ్మె, హైకోర్టు ఆదేశాలపై మంత్రి పువ్వాడ, సంబంధిత ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్... కార్మికుల్ని చర్చలకు పిలిచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. యూనియన్లు లేని ఆర్టీసీనే తమ ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ నష్టాలకు యూనియన్లే కారణమన్న కేసీఆర్... యూనియన్లు లేకపోతే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలపైనా చర్చించిన కేసీఆర్... సంస్థ నష్టాల్లో ఉంటే జీతాలు పెంచమని ఏ న్యాయస్థానమూ చెప్పదని అన్నారు. ఆల్విన్ కంపెనీ మూతపడితే ఎవరూ ఏమీ చేయలేకపోయారని గుర్తుచేసిన కేసీఆర్... ఆర్టీసీ మరో ఆల్విన్ కంపెనీ కాకూడదనే తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఇక, ఆర్టీసీ దివాలా పరిస్థితిని హైకోర్టు ముందుంచాలని ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని గతంలో ప్రకటించిన సీఎం కేసీఆర్... ఇప్పుడు తిరిగి ఉద్యోగాలు ఇవ్వమన్నా ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. అయితే, సమ్మె విరమిస్తామని ఒక వర్గం తమకు సంకేతాలు పంపిందని, కానీ యూనియన్లతో లాలూచీ పడాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. హైకోర్టు ఆదేశించినాసరే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్... పూర్తిస్థాయిలో బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.