కేంద్రంపై రైతులు పిడికిలి బిగించి ఉద్యమించాలి
posted on Oct 31, 2020 @ 4:50PM
జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని, కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ లేదని, రైతులు కూర్చొని మాట్లాడుకునేందుకు వేదిక ఏర్పాటు చేసినందుకు గర్వపడుతున్నానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
ఇతర దేశాల్లో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయి. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలనుకున్నా కేంద్రం ఆంక్షలు అడ్డుపతున్నాయని ఆరోపించారు. కేంద్రం నిర్థారించిన మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయొద్దని ఎఫ్‌సీఐ అంటోందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదు. రైతులను నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని, కార్పొరేట్ కంపెనీల కోసమే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని కేసీఆర్ విమర్శించారు. వ్యవసాయ బిల్లును అడ్డగోలుగా పాస్ చేసిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని, కేంద్రం తీరు బాగోలేదు కాబట్టే దసరా పండుగ రోజు రావణాసురుడికి బదులు మోదీ బొమ్మలు తగలబెట్టారని అన్నారు. కేంద్రంపై రైతులు పిడికిలి బిగించి ఉద్యమించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.