ప్రధానికి సీఎం జగన్ లేఖ.. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
posted on Oct 31, 2020 @ 5:27PM
పోలవరం ప్రాజెక్టు నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోత విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక మంత్రులకు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ఏడు పేజీల లేఖ రాశారు. ప్రాజెక్టు నిధుల విషయంలో జోక్యం చేసుకోవాలని లేఖలో సీఎం జగన్ కోరారు.
విభజన చట్ట ప్రకారం పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తుచేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటిదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ, పునరావవాస చర్యలకు కూడా నిధులను ఇవ్వాలంటూ 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని లేఖలో ప్రస్తావించారు. నిధుల విడుదల జాప్యం, పనులు ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని లేఖలో సీఎం జగన్ పేర్కొన్నారు.