లోకేష్‌కు క్లీన్ చిట్.. జగన్ బండారం బైటపడిపోయిందిగా?
posted on Oct 12, 2023 @ 6:08PM
వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఇరికించిన స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టై నెల రోజులు దాటింది. ఇదే కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అరెస్ట్ కాబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వస్తున్నది. స్వయంగా సీఐడీ చీఫ్ మీడియా సమావేశంలోనే లోకేష్ ను అరెస్టు చేస్తామని ప్రకటించారు. లోకేష్ కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. ఈ కేసులో నారా లోకేష్‌కు క్లీన్ చిట్ లభించింది. స్వయంగా సీఐడీయే లోకేష్ ఈ కేసులో నిందితుడు కాదని కోర్టుకు తెలిపింది. గురువారం ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. విచారణ సందర్భంగా సీఐడీ లోకేష్‌ను స్కిల్ కేసులో నిందితుడిగా తాము చేర్చలేదని చెప్పింది. అసలు లోకేష్ ను ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ ఈ కేసులో నిందితుడిగా చేరిస్తే 41-ఏ కింద నోటీసులు ఇస్తామని న్యాయస్థానానికి సీఐడీ అధికారులు వెల్లడించారు.
నిజానికి చంద్రబాబు అక్రమ అరెస్ట్ అయిన వారానికే నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని అధికార వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తెలిసిందే. వైసీపీ మంత్రుల నుండి సలహాదారుల వరకూ అంతా మీడియా ముందుకొచ్చి లోకేష్ కూడా అరెస్ట్ కానున్నట్లు చెప్పారు. ఒక కేసులో బెయిల్ దక్కినా ఎన్ని కేసులైనా పెట్టి ఆయనను కూడా జైలుకు పంపిస్తామని వైసీపీ నేతలు శపథాలు కూడా చేశారు. అప్పటికి నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. లోకేష్ ఢిల్లీ నుండి రాగానే అరెస్ట్ చేయాలని భావించారు. కానీ లోకేష్ ఢిల్లీ నుండి వచ్చినా అరెస్ట్ చేయలేదు. మళ్ళీ లోకేష్ ఢిల్లీ వెళ్లినా వైసీపీ నేతల నుండి కానీ, సీఐడీ నుండి కానీ లోకేష్ అరెస్ట్ మీద ప్రకటనలు లేవు. ఇంకా చెప్పాలంటే అసలు ఏమైందో ఏమో కానీ తర్వాత అరెస్ట్ ఊసే లేకుండా పోయింది.
కానీ, అప్పటికే లోకేష్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పైన ఈ నెల 4న విచారణ జరగగా.. అప్పుడు గురువారం(అక్టోబర్ 12) వరకూ అరెస్ట్ చేయవద్దని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది. నేడు మరోసారి విచారణ జరగగా సీఐడీ తరపు లాయర్లు కోర్టుకు తమ వివరణ ఇచ్చారు. అసలు స్కిల్ కేసులో లోకేష్ నిందితుడే కాదని, ఆయనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధంలేదని న్యాయస్థానం ముందే సీఐడీ క్లియర్ కట్ గా చెప్పింది. లోకేష్‌ను స్కిల్ కేసులో నిందితుడిగా తాము చేర్చలేదని, ముద్దాయిగా చూపని కారణంగా ఆయన్ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. దీంతో ఈ కేసులో లోకేష్ కు కంప్లీట్ రిలీఫ్ లభించింది. గతంలో ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ నిందితుడు కాదని చెప్పగా.. ఇప్పుడు స్కిల్ కేసులో కూడా క్లీన్ చిట్ ఇచ్చారు.
స్కిల్ కేసు విషయంలో మొదట్నుంచీ అన్నీ అనుమానాలే. అసలు ఈ కేసు చంద్రబాబు, లోకేష్ పేర్లు లేవు. కానీ, ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబును అరెస్టు చేసి.. ఆ తరువాత ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు చేర్చారు. ఇప్పుడు ఆధారాలు చూపలేక నానా తిప్పలూ పడుతున్నారు. నెల రోజులుగా ఈ కేసును నిరూపించుకునేందుకు న్యాయనిపుణులు, సీనియర్ న్యాయమూర్తుల సలహాలతో సీఐడీ మల్లగుల్లాలు పడుతుంది. ఇది అక్రమ కేసని ఇప్పటికే ప్రజలకు క్లియర్ కట్ గా అర్ధమైపోయింది. అలాంటిది ఇప్పుడు ఈ కేసులో లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే సమస్య మరింత ముదురుతుందని భావించే వెనక్కు తగ్గినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో వైసీపీ తన పతనాన్ని తనే శాశించుకుందనీ, ఇక లోకేష్ ను కూడా అరెస్టు చేస్తే ఉనికే లేకుండా పోతుందన్న తత్వం బోధపడటంతోనే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందని అంటున్నారు. స్కిల్ కేసులో లోకేష్ కు క్లీన్ చిట్ ఇస్తూ సీఐడీయే కార్టుకు తెలియజేయడంతోనే జగన్ బండారం బైటపడిపోయిందనీ, కేవలం కక్ష సాధింపు కోసమే చంద్రబాబును అరెస్టు చేశారనీ మరో నిర్ద్వంద్వంగా తేలిపోయిందనీ అంటున్నారు.