విజయసాయి రెడ్డి కేంద్రాన్ని విమర్శించారు.. కారణమదేనా?
posted on Aug 3, 2022 7:41AM
విజయసాయిరెడ్డికి కేంద్రంపై కోపం వచ్చింది. మోడీ సర్కార్ రాష్ట్రాలను ముంచేస్తోందని విమర్శించారు. కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న విషయం ఆయనకు ఇప్పుడు తెలిసింది. అంతే రాజ్యసభ సాక్షిగా కేంద్రంపై విమర్శల వర్షం కురిపించేశారు. కేంద్రం రాష్ట్రాలను దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఇంతలా పెంచేస్తే పేద, మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారని నిలదీశారు.
ద్రవ్యోల్బణం అరికట్టడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఇంత చేసినా ఆయన రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన వాటిని వేటినీ ప్రస్తావించలేదు. విశాఖ రైల్వే జోన్ కానీ, పోలవరం బకాయిల గురించి కానీ, విశాఖ ఉక్కు ప్రైవైటైజేషన్ ఆపాలని కానీ, ఆఖరికి కడప ఉక్కు కర్మాగారం గురించి కానీ ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. జనరల్ గా కేంద్రం రాష్ట్రాలను అన్యాయం చేస్తోందని ఓ ప్రసంగం దంచేశారు. అందులో కేంద్రం రాష్ట్రాలను దోచేస్తోందని విమర్శలు గుప్పించారు.
ఇంత కాలంగా కేంద్రం తిట్టినట్టు చేస్తే వైసీపీ సర్కార్ కనీసం ఏడ్చినట్లు కూడా చేయలేదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రంపై విమర్శలు గుప్పించినట్లు చేశారు. కేంద్రం పట్టించుకోనట్లు చేస్తుంది అంతే అని పరిశీలకులు అంటున్నారు.
సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి ఇవ్వడం లేదనీ, పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదనీ అన్నారు. ఏడేళ్లలో ఏపీ 46వేల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడి ఆర్థిక సంక్షోభం అంచున నిలిచిన నేపథ్యంలో తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునే ప్రయత్నమే విజయసాయి రాజ్యసభలో కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెత్తపై పన్ను కేంద్రం వేసిందా అని పరిశీలకులు నిలదీస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా చేసిన అప్పుల కారణంగా ఇకపై అప్పులు పట్టిని దుస్థితిలో ప్రజల దృష్టి మరల్చి గట్టెక్కాలన్న ఉద్దేశంతోనే విజయసాయి కేంద్రంపై విమర్శలు గుప్పించారని అంటున్నారు.