ఏపీ రుణపరిమితి లక్ష్మణ రేఖ దాటేసింది.. రాజ్యసభలో నిర్మలా సీతారామన్ వెల్లడి
posted on Aug 3, 2022 8:02AM
ఏపీ రుణపరిమితి లక్ష్మణ రేఖను దాటేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అడ్డగోలుగా అప్పులు చేసి వాటిని బడ్జెట్ లో చూపకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించింది. అందుకే కార్పొరేషన్లు స్పెషల్ పర్పస్ వెహికిల్, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా జగన్ సర్కార్ చేసిన అప్పులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే కేంద్రం పరిగణించింది. ఈ విషయాన్ని గత మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభ సాక్షిగా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఈ మేరకు బదులిచ్చారు. 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేందుకు రూ. 65,489.36 కోట్లకు పైగా గ్యారెంటీలు ఇచ్చిందన్నారు. ఇందులో 2020-21లో రూ.46,719.42 కోట్లు, 21-22లో రూ.18,770.54 కోట్లకు గ్యారెంటీలు ఇచ్చినట్లు చెప్పారు.
ఈ సమాచారాన్ని రాష్ట్రప్రభుత్వమే ఈ ఏడాది ఏప్రిల్ 27న కేంద్రానికి ఓ లేఖ ద్వారా తెలియజేసిందని నిర్మలా సీతారామన్ వివరించారు. అలాగే 1920-21లో వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.22,549.5 కోట్లు, 21-22లో రూ.6.287.7 కోట్లు అప్పులు తెచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 293(3) అధికరణ ప్రకారం 22-23లో కూడా అప్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరిందని వెల్లడించారు.
ఇక వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డిఅడిగిన మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ బదులిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ది కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ) సహా పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు సాధారణ నికర రుణ పరిమితిని ఉల్లంఘించి రుణాలు చేసినట్లు చెప్పారు. వాణిజ్యపరమైన లాభ నష్టాలను, రుణాలను చెల్లించగల ఆదాయ సామర్థ్యాన్ని, నిధులు ఎక్కడకు మళ్లిస్తున్నారో గమనించకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు బ్యాంకులు రుణాలివ్వడాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కూడా తప్పు పట్టిన విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రుణాలు, అడ్వాన్సులు మంజూరు చేసేటప్పుడు ఆర్‌బీఐ ఆదేశాలను పాటించాలని బ్యాంకులను నిర్దేశించినట్లు తెలిపారు.