విజయోత్సాహంలో… చంపేశారు!
posted on Feb 9, 2016 9:05AM
ఎన్నికలలో గెలిస్తే ఎవరన్నా మిఠాయిలు పంచుకుంటారు, మరీ సరదాగా ఉంటే రంగులు చల్లుకుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో తుపాకులను గాలిలోకి కాలుస్తుంటారు. అలాంటి ఒక సంఘటనలో గత ఆదివారం ఒక అభంశుభం ఎరుగని పిల్లవాడు బలైపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా పట్టణంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇందులో సమాజ్‌వాదీకి చెందిన నఫీసా అనే అభ్యర్థి గెలుపొందారు. ఆ గెలుపు సందర్భంగా నఫీసా అనుచరులు గాల్లోకి కాల్పులు జరపడంతో అదే దారిలో రిక్షాలో వెళ్తున్న సమి అనే ఎనిమిదేళ్ల పిల్లవాడు మృతిచెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తుపాకుల రాజ్యం ఏలుతోందని ఇప్పటికే తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఘటన వల్ల తన ప్రభుత్వానికి మరింత మచ్చ ఏర్పడే అవకాశం ఉందని భావించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. దాంతో స్థానిక పోలీస్ అధికారులను ఆగమేఘాల మీద సస్పెండ్ చేశారు. మరో పక్క పోలీసులు కూడా ఈ ఘటనకు కారణమైన ఒక ముగ్గురిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. పిల్లవాడి తరఫున బంధువులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు.