మూడు మాస్క్‌లు ఏవీ...?: చంద్రబాబు
posted on May 5, 2020 @ 10:33AM
ముఖ్యమంత్రి జగన్ మూడు మాస్క్‌లు పంపిణీ చేస్తామన్న మాట గాలికి వదిలేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రతి ఒక్కరికి 3మాస్క్ లు పంపిణీ చేయలేదని, అరకొర చోట్ల ఇచ్చిన మాస్క్ లు కూడా కిరోసిన్ కంపుకొట్టేవి, విద్యార్ధుల యూనిఫామ్ క్లాత్ తో కుట్టినవి కావడంతో అక్కడే పారేసి పోతున్నారు. అదే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున టిడిపి అందజేసిన మాస్క్ ల నాణ్యత ఎంతో బాగుంది. నాణ్యమైన మాస్క్ లు ప్రతి పేద కుటుంబానికి వెంటనే పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మద్య నిషేధం పట్ల వైసిపి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని చంద్రబాబు విమర్శించారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలిస్తే అక్కడ మద్యం దుకాణాలు తెరిచి ప్రజల రక్తం పిండుకోవడం దారుణమని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులు పండించిన పంటలో పదోవంతు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, పంటలకు ధరలు లేక రైతులు నైరాశ్యంతో ఉన్నారని విమర్శించారు. క్వారంటైన్ కేంద్రాల నుంచి 14 రోజుల తర్వాత ఇంటికెళ్లేవారికి రూ.2 వేలు అందిస్తామన్న హామీ కూడా అమలు కాలేదన్నారు.
హైదరాబాద్ నుంచి టిడిపి నేతలతో ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడారు. మద్దతు ధరల కోసం రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించడం వైసిపి ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమన్నారు. లాక్ డౌన్ తో కోట్లాది పేదలు ఉపాధి కోల్పోయి తినడానికి తిండిలేక అల్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పదోవంతు పంటలు కొనలేదనడానికి కోర్టులో ప్రభుత్వ అఫిడవిట్ సాక్ష్యం. పండించిన పంటలకు ధరలు లేక రైతులంతా నైరాశ్యంలో ఉన్నారు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తెలంగాణలో ధాన్యం ఇప్పటికే 21లక్షల మెట్రిక్ టన్నులు కొనగా ఏపిలో కేవలం 4.92లక్షల టన్నులకే పరిమితం కావడం గప్పాలు కాక మరేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల కంటితుడుపు ప్రకటనలే తప్ప రైతులను ఆదుకుంది శూన్యమని చంద్రబాబు ఆరోపించారు.
కరెంటు బిల్లులు తడిసి మోపెడై అల్లాడుతున్నారు. గతనెల బిల్లు రీడింగ్ కు అదనంగా ఈ నెల రీడింగ్ కలిపి ఆ మొత్తంపై పెరిగిన శ్లాబు ప్రకారం కరెంటు బిల్లులు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం దారుణమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.