సిఎంలుగా నాయుడు... జగన్ పూర్తిగా ఐఏఎస్‌ల మీదే ఆధార పడ్డారు
posted on Feb 11, 2020 @ 11:06AM
ఒకరు సంక్షోభాలతో చెలిమి చేస్తే, మరొకరు పైనున్న దేవుడిపైన భారం వేశారు...
ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు అంటూ ప్రజలను ఎమోషనల్ గా టచ్ చేసిన యువ నేత జగన్మోహన రెడ్డి. తనపై రుద్దబడిన లక్ష కోట్ల అవినీతి బురదను వదిలించుకోవటానికి లేదా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ఈయనకు తొమ్మిదేళ్ల గడ్డు కాలం పట్టింది. నాయుడిదయితే డిఫ్ఫరెంట్ స్టైల్. ఆధునికాంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ పితగా తనను తాను ఆయన మార్కెట్ చేసుకున్న తీరుకు నార్త్ ఇండియా ముఖ్యమంత్రులు సైతం ఫిదా అయిపోయి, ఆయన చేత రెండు దశాబ్దాలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పించారు. వివిధ జాతీయ పార్టీల గోసలకు , వాటి మధ్య సమన్వయానికి ఆయనే చుక్కాని అయ్యారు. అటువంటి నాయుడిని ఈ రోజు 24 గ్రామాల చక్రబంధంలో ఇరికించింది వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే , తాజాగా... ఆయన ఒకప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అతడి నుంచి విలువైన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సేకరింపచేసిన అమిత్ షా-మోడీ ద్వయం తెలుగుదేశాన్ని ఇరకాటం లో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు.
ఓ సారి నాలుగేళ్ల వెనక్కు రీలు తిప్పితే--అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2014లో విజయవాడ వచ్చేసి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత 2015 మధ్యలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక పాజిటివ్ అప్రోచ్ కనిపించింది. . 'విభజనలో అన్యాయం జరిగింది. అయినా రెట్టింపు ఉత్సాహంతో, ధృఢ సంకల్పంతో పనిచేయాలి. హైదరాబాద్ నగరాన్ని తలదన్నే మహా నగరాన్ని నిర్మించుకోవాలి' అనే పాజిటివ్ స్పిరిట్ఆ యన మాటల్లో ధ్వనించింది. ప్రజల్లో అనేక కొత్త ఆలోచనలు, ఆశలు రేకెత్తించే పదాలు ఆ సందర్భంలో వినిపించాయి. ఆ తర్వాత ఆలాంటి 'స్ఫూర్తి'నిచ్చే ప్రసంగాలే 2018 మార్చి వరకూ కొనసాగాయి. అయితే ప్రజలు ఆతర్వాత ఎన్నికల్లో భిన్నంగా స్పందించారు.
ఇప్పుడు, అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి- రాష్ట్ర ఆర్ధిక వాస్తవ పరిస్థితి, తాను ప్రజలకిచ్చిన హామీలు, రెండింటి మధ్య సమన్వయము చేస్తున్న తీరు, రాష్ట్ర పరిస్థితిపై తన ప్రణాళికలు చెపుతున్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టు .'గాలిలో మేడలు, అసాధ్యమైన హామీలు ఇచ్చే ఆలోచన తనకు లేదని, మన రాష్ట్ర పరిస్థితి అర్ధం చేసుకుని ఆ మేరకు ఎంత చేయగలమో అంతే మాట్లాడాలి' అనే భావం వినిపించింది.మరి అయినా సారం జగన్మోహన్ రెడ్డి ఎందుకింతగా ఆఫీసర్ల మధ్యన సమన్వయము సాధించుకోలేకపోతున్నారు. ఏ రాష్ట్ర చరిత్ర లోనూ లేని విధంగా ప్రస్తుతం, ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ ల మధ్య ఆధిపత్య పోరుకు అమరావతి సెక్రెటేరియట్ వేదిక కావటం ప్రస్తుతం దేశం మొత్తం చూస్తున్న చోద్యం. ముఖ్యమంత్రులుగా అటు నాయుడు, ఇటు జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ని పరిశీలిస్తే, నాయుడి ఎడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ చాలా గుంభనం గా వ్యవహరించేది. లోపల తగువులున్నప్పటికీ, ఎక్కడా ఎవరూ బయటపడిన సందర్భాలు లేవు. ఇప్పుడు అందుకు భిన్నంగాఉంది... జాస్తి కృష్ణ కిషోర్, ఏ బి వెంకటేశ్వర రావు ల ఎపిసోడ్లు పరిశీలిస్తే, అమరావతి సచివాలయం నేషనల్ మీడియాకు కావలసినంత మసాలాను ఉత్తి పుణ్యానికే అందించినట్టు తెలిసిపోతోంది. ఇది అవాంఛనీయ, అనభిలషణీయ పరిణామమని సీనియర్ అధికారులంటున్నారు. అమరావతి లో క్యాపిటల్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ, ఇలాంటి సంఘటనల ద్వారా రాష్ట్రం పరువు ఢిల్లీ వీధుల్లో మార్కెట్ వస్తువుగా మాత్రం మారిపోయింది. ఇక నైనా , అధికారం లో ఉన్న వారు పూర్తిగా ఐ ఏ ఎస్ ల మీద ఆధారపడి పాలన సాగించే ఛత్రం నుంచి బయట పడాలి. నాయుడి ఓటమి కి కారణం ఆయన పూర్తిగా బ్యూరోక్రాట్లమీదే ఆధారపడటం అని తెలుగుదేశం లో సీనియర్ నాయకులు ఇప్పటికే, ఒక పార్టీ అధ్యక్షడుకి ఒక ధీసిస్ కూడా సమర్పించిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకోవాలి.