విజనరీ అంటే చంద్రబాబే...అహ్లూవాలియా
posted on Jul 27, 2022 @ 6:11PM
మీ అబ్బాయి బాగా చదువుతాడండీ, మహా చురుకు.. అని పక్కింటివాళ్లు వచ్చి చెప్పేవరకూ ఆ కుర్రాడిని ఇంట్లోవాళ్లు అంగీకరించారు. ఒకవేళ కాస్తంత అనుమానం ఉన్నా అప్పటికి గాని తేరుకుని అవునుసమా.. అంటే కాదు మరీ అనుకుంటారు. ఉమ్మడి ఆంధ్రా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించీ ఆలోచిస్తే అవును నిజం అనిపిస్తుంది. ఆయన గొప్ప విజనరీ అని అహ్లూవాలియా వచ్చి గుర్తు చేస్తేగాని తెలుగువారు తేరుకోలేదు. అధికారానికి దూరమైనంత మాత్రాన తెలివితేటలు, అభివృద్ధి దృష్టి ఆలోచనలో ఎలాంటి మార్పు రాదు. గతంలో చేసింది బంగారమైతే గోడకి కొట్టినట్టు ఎన్నాళ్లయినా, ఎవర యినా ప్రశంసించాల్సిందే గదా!
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో దేశంలో ఆర్థిక సంస్కరణలపై కీలక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సివిల్ సర్వెంట్ మాజీ అధికారి, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్య క్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాంటెక్ సింగ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి విజనరిని ఈ సందర్బంగా ఆయన ప్రశంస లతో ముంచెత్తారు. అంతేకాదు.. ఆర్థిక సంస్కరణల అమలులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. అలాగే సైబరాబాద్‌ని సృష్టించి హైదరాబాద్ అభివృద్ధికి ఆయన పాటుపడిన తీరు అద్భుతమన్నారు. తన ఆలోచనతో.. ఓ నగరాన్ని రూపాంతరం చెందడం కోసం నాటి సీఎంగా చంద్ర బాబు చేసిన కృషిని ఆయన కొనియాడారు.
ఇక ఐటీని హైదరాబాద్‌కు తీసుకు వచ్చేందుకు.. నాడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు తన విజనరితో రూపొందించిన ప్రణాళికలను ఈ సందర్భంగా దాదాపు గంటన్నర సేపు ఆయనకు చంద్రబాబు వివరిం చారని మాంటెక్‌సింగ్ అహ్లువాలియా తెలియజేశారు. అంతేకాదు.. సైబరాబాద్ పేరిట చంద్రబాబు చేసిన కృషిని అప్పట్లో కొందరు ఎగతాళి కూడా చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అయితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లువాలియా చేసిన వ్యాఖ్యలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే మాంటెక్ సింగ్ కామెం ట్స్‌పై సైతం నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి జరిగిందంటే.. అది చంద్రబాబు కృషి వల్లేనని వారు సోషల్ మీడియా సాక్షిగా స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. చంద్ర బాబు విషయంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార జగన్ పార్టీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని సైతం నెటిజన్లు సోషల్ మీడియా సాక్షిగా ఎండగడుతున్నారు.
ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు విజనరీ గురించి తెలంగాణలోని పాలక పక్షం టీఆర్ఎస్ నాయకు లందరికీ తెలుసునని ఒప్పుకోవడానికి వారికి ఈగో అడ్డు వస్తోందని వారు పేర్కొంటున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన ఏనిమిదేళ్లు పూర్తి అయిందని.. ఈ కాలంలో హైదరా బాద్ రూపు రేఖలు ఏమైనా మారాయా? అంటే అదీ లేదని.. నాటి ట్రాఫ్రిక్ సమస్య నేటికి అలాగే ఉందని.. ఇంకా పెరిగిందని ఈ ఒక్క ఉదాహరణ చాలని వారు సోషల్ మీడియా సాక్షిగా పేర్కొంటున్నారు. ఇక సంక్షేమ పథకాలు అయితే.. పాత సీసాలో కొత్త సారా తయారీ విధి విధానం ఎలాగూ ఉండనే ఉందని వారు చెబుతున్నారు.
ఇక ఆంధ్రపద్రశ్ విషయానికి వస్తే మాత్రం.. అక్కడ అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ అధినేత చంద్రబాబు అంటే ఓ విధమైన కంపరమని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. ఫ్యాన్ పార్టీ అధి కారంలోకి ఇలా వచ్చిందో లేదో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చి వేసిందని.. అక్కడితో ఆగకుండా గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలను తుంగలోకి తొక్కి తన పసితనాన్ని సైతం సీఎం జగన్ చూపించారనే ఓ చర్చ అయితే నేటికి అమరావతి పరిసర ప్రాంత ప్రజల్లో జోరుగా సాగుతోంది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చేశారని.. చంద్రబాబు నాయుడి విజనరికి ఇంతకంటే సాక్ష్యం కావాలా అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను సోషల్ మీడియా సాక్షిగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.