గుజరాత్ లో కల్తీ మద్యానికి 36 మంది బలి
posted on Jul 27, 2022 @ 6:01PM
ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో కల్తీ మద్యం కాటుకు 36 మంది మరణించారు. గుజరాత్ లో సంపూర్ణ మద్య నిషేధం సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం విక్రయాలుయథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వం పట్టించు కోకపోవడంతో ఈ ఘోరం జరిగిందని విమర్శలువెల్లువెత్తుతున్నాయి.
కల్తీ మద్యం కాటుకు 36 మంది బలైపోయారు. మరో 50 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా పలువురి ఆరోగ్యం విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 25నగుజరాత్ లోని బోటాడ్ జిల్లా రోజిద్ గ్రామంలో పలువురు, అహ్మాదాబాద్ జిల్లాలోని ధందుక ప్రాంతాల్లో కొందరు కల్తీ మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మొదట10 మంది చనిపోయారు.
ఆ తరువాత మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రోజిద్ సహా పలు గ్రామాల్లో కొందరు అక్రమంగా మిథైల్ ఆల్కహాల్ లో నీటిని కలిపి నాటు సారాగా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. మిథనాల్ సేవించినట్లు వారి బ్లడ్ శాంపిల్స్ పరీక్షించడంతో తేలింది. కల్తీ సారా అమ్మిన 14 మందిని అరెస్టు చేశారు.
కాగా ఈ ఘటనలపై గుజరాత్ హోంశాఖ ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది . సిట్ సమగ్ర దర్యాప్తు జరిపి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కాగా కల్తీ మద్యం కాటుకు బలైన వారిలో అత్యథికులు రోజువారీ కూలీలేనని పోలీసులు గుర్తించారు.