Read more!

నందమూరి కుటుంబానికి బాబు చెక్?

 

కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తానని చెపుతూ వచ్చిన బాలకృష్ణ, నిన్న కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ తను అవసరమయితే ఎన్నికలలో పోటీ చేయకుండా పార్టీ కోసం ప్రచారంలో పాల్గొంటానని చెప్పడం చూస్తే, ఆయనకు చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదని స్పష్టమవుతోంది. అయితే షరా మామూలుగానే ‘పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా’నంటూ బాలయ్య తన స్టేట్మెంటుకి చిన్న ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. కానీ గెలుపు గుర్రమని చెప్పదగ్గ బాలకృష్ణను ఎన్నికల బరిలో దింపకపోతే అందుకు చంద్రబాబు తగిన కారణం చెప్పవలసి ఉంటుంది.

 

మొన్న తెదేపా అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసిన తరువాత జూ.యన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా? అనే మీడియా ప్రశ్నకు చంద్రబాబు జవాబిస్తూ “పార్టీ కోసం ప్రచారం చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తాము,” అని క్లుప్తంగా జవాబీయడం చూస్తే, ఈసారి పార్టీ కోసం జూ.యన్టీఆర్ సేవలను ఉపయోగించుకొనేందుకు ఆసక్తిగా లేరని స్పష్టమవుతోంది. అదేవిధంగా అతని తండ్రి హరికృష్ణకు కూడా ఈసారి ఆయన టికెట్ ఇస్తారో లేదో అనే ప్రస్తావన రాకుండా జాగ్రత్తపడటం గమనిస్తే ఆయనకీ టికెట్ దక్కడం అనుమానంగానే ఉంది.

 

ఒకవేళ  నందమూరి సోదరులిరువురికీ టికెట్స్ ఈయకుండా, జూ.యన్టీఆర్ ని కీలకమయిన ఈ దశలో కూడా పార్టీకి దూరంగా ఉంచుతూ, మరోవైపు బీజేపీ తరపున వైజాగ్ నుండి పోటీ చేయాలనుకొంటున్న పురందేశ్వరిని కూడా చంద్రబాబు అడ్డుకొన్నట్లయితే, అది ప్రత్యర్ధులకు ఎన్నికలలో బలమయిన ఆయుధంగా మారడం తధ్యం.