24 నుంచి చంద్రబాబు కుప్పం పర్యటన.. మూడు రోజులు అక్కడే మకాం
posted on Aug 22, 2022 @ 2:51PM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆగస్టు 24 (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికలలో కుప్పంలో వైసీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇక అప్పటి నుంచి సీఎం జగన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలన్న లక్ష్యంతో ఆ నియోజవకర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో నియోజకవర్గంలో వైసీపీ ఆధిపత్యాన్ని మొగ్గలోనే తుంచేయాలన్న పట్టుదలతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నెల 24 నుంచి చేపట్టనున్న కుప్పం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
తొలి రోజు రామకుప్పం మండలంలో పర్యటించనున్న చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ మరుసటి రోజు అంటే ఆగస్టు 25న కుప్పం మండలంలోనూ. ఆ మరుసటి రోజు గుడిపల్ల మండలంలో పర్యటించనున్నారు. కాగా ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా నియోజవర్గంలో పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు.
కుప్పంలో వైసీపీ అసత్య ప్రచారాన్ని క్షేత్రస్థాయి నుంచీ తిప్పి కొట్టాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇటీవల జగన్ పార్టీ క్యాడర్ తో సమావేశాలను కుప్పం నియోజకవర్గంతోనే ప్రారంభించిన సంగతి విదితమే. ఆ సందర్భంగా కుప్పం వైసీపీ అభ్యర్థిగా భరత్ ను ప్రకటించిన ఆయన కుప్పం నియోజకవర్గంలో విజయం సాధిస్తు భరత్ కు మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబా బు కుప్పం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకూ చంద్రబాబు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను స్థానిక పార్టీ నేతలకే అప్పగించారు. అయితేు మునిసిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తరువాత ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే 24 నుంచి కుప్పంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.