వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వానికి కేంద్రం అండ!
posted on Aug 4, 2023 @ 10:09AM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఆర్థిక అరాచకత్వానికి కేంద్రంలోని మోడీ సర్కార్ పూర్తిగా అండదండలు అందిస్తోందా? జగన్ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పార్లమెంటు సాక్షిగా అసత్యాలు, అర్ధ సత్యాలు చెబుతోందా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననక తప్పదని పరిశీలకులు అంటున్నారు. లోక్ సభ సాక్షిగా జగన్ సర్కార్ అప్పులపై వైసీపీ రెబల్ ఎంపీ ప్రశ్నకు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ జవాబు చెప్పిన రోజుల వ్యవధిలో రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ చెప్పిన సమాధానం పరస్పర విరుద్ధంగా ఉండటాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.
పార్లమెంటులో నిర్మలా సీతారామన్ జగన్ ప్రభుత్వ అప్పులన్నీ నిబంధనలకు లోబడే ఉన్నాయని చెబితే.. రాజ్యసభలో భగవత్ కరాద్ ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని దాటి జగన్ ప్రభుత్వం అప్పులను తీసుకుందనీ తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణించాలని సూచించారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి లోక్ సభలో రఘురామకృష్ణం రాజు ప్రశ్నకు ఇచ్చిన జవాబు ఆమె వద్ద ఉన్న పరిమిత సమాచారం ఆధారంగానే ఇచ్చారని కుండబద్దలు కొట్టేశారు. మొత్తంగా కేంద్ర మంత్రులు ఒక రాష్ట్రం అప్పులపై ఇచ్చిన రెండు సమాధానాలనూ బేరీజు వేసుకుని చూస్తే జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందనీ పరిశీలకులు అంటున్నారు.
ఈ రెండు సమాధానాలనూ ఉటంకిస్తూ.. రచ్చబండలో భాగంగా బుధవారం (ఆగస్టు 2) న మీడియాతో మాట్లాడిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు జగన్ ప్రభుత్వ అప్పులపై తాను వెల్లడించిన వివరాలు అక్షర సత్యాలని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో జగన్ అయినా సరే ఆయన వంది మాగధులైనా సరే చర్చకు రావాలని సవాల్ విసిరారు. తానే కాదు.. బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి కూడా జగన్ అప్పుల బాగోతాన్ని పూసగుచ్చినట్లు వివరించారన్నారు.
జగన్ ప్రభుత్వం అప్పులు, ఏయే ఆస్తులను తాకట్టు పెట్టి ఎంతెంత అప్పు చేసింది అన్న వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేసే వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే ఇప్పటికే అంటే ఈ ఆర్థిక సంవత్సరం లో తొలి నాలుగు నెలలలోనే 29 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ఏపీ సర్కార్ కు మరో మూడువేల కోట్ల రూపాయల రుణానికి ఎలా అర్హత లభించిందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.