సిబిఐపై ప్రధానికి విజయమ్మ లేఖ
posted on Jan 30, 2012 @ 3:37PM
హైదరాబాద్: సిబిఐ దర్యాప్తు వెనుక రాజకీయ కుట్ర కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఆరోపించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ఆమె ఒక లేఖ రాశారు. మే 2009కి ముందు ఏ రాజకీయ హొదా లేని జగన్మోహన రెడ్డిని విచారించడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. సిబిఐ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకున్న మంత్రులను వదిలిపెట్టి, వైఎస్ కుటుంబ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా సిబిఐ వ్యవహరిస్తోందని తెలిపారు. జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సాక్షులకు సిబిఐ బెదిరిస్తోందన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో స్టైలిష్ హొం ఎండి రంగారావుని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె ప్రశ్నించారు. నిధులు దుబాయ్కి తరలించిన కోనేరు ప్రసాద్ కుమారుడిపైన ఏవిధమైన చర్యలు లేవని తెలిపారు. అన్ని పార్టీలకు డబ్బు ఇచ్చానని కోనేరు ప్రసాద్ చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ వారిని విచారించకుండా, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారినే వేధిస్తున్నారని ఆ లేఖలో ప్రధానికి విజయమ్మ తెలిపారు.