సర్వరోగ నివారిణి-నగదు బదిలీ పధకం
posted on Jan 7, 2013 @ 4:02PM
నగదు బదిలీ పధకాన్ని ఒక ‘గేం చెంజర్’గా అభివర్ణిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఆ పధకాన్ని‘సర్వ రోగ నివారిణి’గా భావిస్తున్న తీరుచూస్తే, ఆపధకంపై గంపెడు ఆశలు పెట్టుకొన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఏడాది కాలంగా ఆ పధకాన్ని రాజస్తాన్ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలుచేసి విఫలమయినపటికీ, లొసుగులమయమయిన దానినే పట్టుకొని ఇంకా వ్రేలాడుతూ, తమ పార్టీని రాగల ఎన్నికలలో అదే ఆదుకొంటుందని గుడ్డిగా నమ్ముతూ ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలి కలుగక మానదు.
ఒక వైపు గ్యాస్, కరెంటు, పెట్రోలు వంటి నిత్యావసరాలను సామాన్య ప్రజలకి అందనంత ఎత్తుకి తీసుకుపోతూ, వాటిని కూడా విలసవస్తువుల జాబితాలో చేర్చేసిన కాంగ్రెస్ పార్టీ, తానూ తీసుకొంటున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాలన్నిటినీ కూడా తన ‘సర్వ రోగ నివారిణి’ నగదు బదిలి పధకం మాటునదాచేసి ఎన్నికల గండాన్నిగట్టేకేయవచ్చుననే భ్రమలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు, సామాన్యుడిని అధిక ధరలతో, కరెంటు సర్ చార్జీలతో నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తానూ విదిలించే నాలుగైదు వందల రూపాయల నగదు బదిలీతో ప్రజలని భ్రమింపజేసి ఎన్నికలలో గెలిచేయగలనని భావించడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు.
అనేక సం.లు అధికారంలో ఉండి, అనేక ఎన్నికలలో భంగాపాటు చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రజల నాడిని, వారి మూడును పసికట్టలేకపోవడం ఒక వింతయితే, పసికట్టలేకపోయినా ఈ విదంగా ఆత్మవంచన చేసుకోవడమే మరో వింత.
కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు మరియు డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ఈ పధకాన్ని ప్రసంశిస్తూ, ‘దాని ద్వారా ప్రభుత్వం పేదవారికిచ్చే రూ.500లలో నలుగురయిదుగురున్న ఒక కుటుంబం నెలంతా హాయిగా బ్రతికేయగలదు’ అని చెప్పడం, కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి ఎంత హీనంగా ఆలోచిస్తోందో తెలియజేపుతోంది.
ప్రజలు ఆ పధకాన్ని మాహాద్భుతం అని నమ్మకపోయినా కనీశం కాంగ్రెస్ పార్టీ అయినా నమ్ముతోందా అంటే సందేహమే. నిన్న తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత ఆర్భాటంగా ఆరంబించిన ఈ పధకాన్నిముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆకాసానికి ఎత్తేస్తుంటే, పక్కనే ఉన్నకేంద్ర మంత్రి జై రామ్ రమేష్, నగదు బదిలీ పధకం అంటే అన్ని కష్టాలను, సమస్యలను మాయం చేసే మంత్రందండం కాదు, అని చురకలు వేసేరు. దానినిబట్టి కాంగ్రెస్ పార్టీలో కొందరయిన ఆ పధకం తమని ఆదుకోదని అర్ధం చేసుకొన్నట్లు అర్ధం అవుతోంది.
ఒకవైపు, ప్రజలని నానా ఇబ్బందులకు గురిచేస్తూ, “మీరు ఇంకా ఇంకా త్యాగాలు చేయడానికి సిద్దం కావలసిందే అంటూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ పార్టీని, రానున్న ఎన్నికలలో ప్రజలు త్యాగం చేస్తారేమో అనే బెంగ అంతర్లీనంగా ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చవకబారు ఆలోచనలతో ముందుకు సాగిపోతోంది.
దేశానికి ఒక గొప్ప యువనాయకుడిని అందించబోతున్నామని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీకి మరి ఆ నాయకుడు చేస్తున్న దిశానిర్దేశం ఇదేనా అని ఆలోచిస్తే, రేపు అతని పాలన మరెంత సమ్మగా ఉండబోతోందో ఇప్పుడే అర్ధం అవుతోంది.
కాంగ్రెస్ పార్టీ, గుజరాత్ ఎన్నికలలో చావుదెబ్బ తిన్నతరువాతనయిన, ప్రజలు తమ నుండి ఏమి కోరుకొంటున్నారో తెలుసుకోకుండా, ఇటువంటి పధకాలతో ముందుకు సాగితే కాంగ్రెస్ పార్టీని నిజంగానే ప్రజలు త్యాగం చేయక తప్పదు.