రాజకీయ రంగులద్దుకొంటున్న అక్బరుద్దీన్ కేసు
posted on Jan 8, 2013 4:30AM
సాధారణంగా ఏదయినా వివాదంలో చిక్కుకొన్న రాజకీయ పార్టీ మొట్టమొదట చేసే పని ఎదురుదాడికి దిగడం, ఆ తరువాత దానిని రాజకీయం చేయడం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఇదొక విజయవంతంగా నిరూపింపబడిన మంచి రాజకీయ ఫార్ములా అయిపోయింది. ప్రస్తుతం యం .ఐ.యం. పార్టీ శాసనసభ్యుడు అక్బరుదీన్ ఓవైసి కేసులో కూడా ఆ పార్టీ అదే చేస్తోంది.
సోమవారం సాయంత్రం ముగిసిన సమావేశంలో ఆ పార్టీ అధినేత అసదుదీన్ ఓవైసి మాట్లాడుతూ, తమ పార్టీ సభ్యుడికి తమ పూర్తీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అసలు కాంగ్రెస్ పార్టీయే స్వయంగా ఈ కుట్రపన్ని తమపైకి పోలీసులను ఉసిగొల్పుతోందని అయన అన్నారు.ఈ నెల 26 లేదా 28వ తేదిల్లో ఈ కుట్ర వెనుక దాగి ఉన్న అసలు రహస్యం బయటపెడతానని అయన అన్నారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ అత్యంత ఎక్కువ సీట్లు సాదించబోతోందని ఆయన అనడం, ఈ కేసు ద్వారా రాజకీయ ప్రయోజనాలు కూడా పొందాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది.
ఆ పార్టీ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఇంతవరకు తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందునే, ఇదివరకు ఇటువంటి సంఘటనలలో నమోదు చేయబడిన కేసులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని, గానీ ఇప్పుడు ఆ పార్టీకి తమ మద్దతు ఉపసంహరించుకోవడం వల్లనే ఈ విదంగా కుట్రపన్ని తమను కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. తాము ఇటువంటి తాటాకు చప్పు ళకు బయపడేవారము కామని, అవసరమయితే కోర్టుల్లో న్యాయ పోరాటానికి కూడా తాము సిద్దమని చెప్పారు.
గత ఐదు దశాబ్దాలుగా నలుగుతూన్న తెలంగాణా సమస్యని కేంద్రం మరో 20 రోజుల్లో పరిష్కరించబోతున్న ఈ సమయంలో, తెలంగాణాలో అకస్మాత్తుగా ఇటువంటి మతకలహాలు చెలరేగడం, తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటం, షిండే ప్రకటన వెలువడిన కొద్దిరోజులకే ఇదంతా మొదలవడం చూసి ఆందోళన చెందుతున్న తెరాస పార్టీ నేతలు, ఇది కాంగ్రెస్ , జగన్ కాంగ్రెస్, తెలుగుదేశం మరియు యం.ఐ.యం.పార్టీలు కలిసి మొదలుబెట్టిన నాటకమని దుయ్యబడుతున్నారు. తెలంగాణాలో అరాచక పరిస్థితులను సృష్టించి, కేంద్రాన్నిబయపెట్టి, వచ్చే తెలంగాణాని అడ్డుకోనేందుకే అందరూ కలిసి నాటకమాడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక భారతీయజనతాపార్టీ కిరణ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక దేశ ద్రోహిని అరెస్ట్ చేయలేకపోతున్న ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా అని ఎద్దేవా చేసింది. యం.ఐ.యం.ని విమర్శిస్తూ ఆ పార్టీ కాంగ్రెసును వీడి బయటకి వచ్చిన తరువాత రాజకీయంగా ఎదిగెందుకే ఈ డ్రామా మొదలు పెట్టిందని, ఇంతవరకు పాతబస్తీ పార్టీగా మిగిలిపోయిన ఆ పార్టీ రానున్న ఎన్నికలలో తన పరిదిని, సీట్లను పెంచుకోవడానికే ఈ నాటకమాడుతోందని విమర్శించింది.
ఇక తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో క్లుప్తంగా స్పందిస్తూ అక్బరుదీన్ ప్రసంగాన్ని ఖండించింది .
అయితే, ఈ విషయంలో అసలు నోరు మెదపని ఒకే ఒక పార్టీ వై.యస్సార్,కాంగ్రెస్ పార్టీ. అది నామ మాత్రంగానయినా అక్బరుద్దీన్ వ్యాఖలను ఖండించక మౌనం వహిస్తోంది.
మొత్తం మీద యం.ఐ.యం.పార్టీకి ఇప్పుడు అక్బరుదీన్ అరెస్ట్ అయినట్లయితే మైనార్టీ వర్గాలనుండి సానుభూతి పిండుకోనే అవకాశమే కాకుండా, ఈ వ్యవహారం వల్ల తమ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రచారం లబించినందుకు సంతోషపడుతోంది. అందువల్ల ఈ కేసు ఎంత కాలం సాగదీస్తే ఆ పార్టీకి అంత ప్రచారం, అంత సానుభూతి ఫ్రీగా దొరుకుతాయి.
అయితే, ఇటువంటి వివాదాలవల్ల యం.ఐ.యం. పార్టీ తాత్కాలికంగా మైనార్టీ వర్గాలను ఆకర్షించగలదేమో గానీ, దీర్ఘకాల రాజకీయ ప్రయోజనాలు మాత్రం పొందలేదు. రాజకీయంగా ఎదగాలనుకొనే ఆ పార్టీ ఇంతకంటే మంచి దారులను ఎంచుకొన్నపుడు మాత్రమే మైనార్టీలు సైతం తాము విస్వసించదగ్గ రాజకీయ పార్టీగా గుర్తించి ఆదరిస్తారు. తాము ఓటువేసే పార్టీ తమ ప్రయోజనాలను కాపాడుతుందని, ఇతర రాజకీయ పార్టీలకన్నా యం.ఐ.యం. మేలని వారు భావించినప్పుడే ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉంటుంది. కేవలం వివాదాలు, సంచలనాల ఆదారంగా మన దేశంలో ఏ రాజకీయ పార్టీ పైకెదిగిన దాఖలాలు లేవు అని యంఐ.యం. ఇప్పటికయినా తెలుసుకొంటే మంచిది.