సీఎం వ్యాఖ్యపై సభలో దుమారం రేపిన టీడీపీ
posted on Feb 23, 2012 @ 3:45PM
హైదరాబాద్: తమ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం సభ్యులు గురువారం శాసనసభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని తమ నిరనస తెలిపారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎమ్మార్ పాపం చంద్రబాబుదేనని సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యతో సభలో ఈ దుమారం చెలరేగింది. స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న తెలుగుదేశం సభ్యులు ఎంతగా స్పీకర్ సర్దిచెప్పినా వినలేదు. దీంతో ముఖ్యమంత్రి ప్రసంగం నిలిచిపోయింది.
చంద్రబాబుకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జోక్యం చేసుకుని - ముఖ్యమంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత చంద్రబాబు వివరణ కోరవచ్చునని, అప్పుడు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారని, ఇప్పుడు సభా కార్యక్రమాలను తెలుగుదేశం సభ్యులు సాగనివ్వాలని ఆయన అన్నారు. స్పీకర్ ఎంతగా చెప్పినా తెలుగుదేశం సభ్యులు వినలేదు.