రాజధాని లేని రాష్ట్రం అంటూ బొత్స పరువు తీసిన తెలంగాణ మంత్రి!
posted on Jul 13, 2023 @ 4:59PM
మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కనీసం పరీక్షలు కూడా నిర్వహించుకోలేని స్థితిలో తెలంగాణ ఉందని ఏపీ మంత్రి అంటే.. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం మీరు కూడా మమ్మల్ని అంటారా అంటూ తెలంగాణ మంత్రి కౌంటర్ వేశారు. టీఎస్పీఎస్సీపై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ట్రాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితిలో తెలంగాణలో ఉందన్నారు. అంతేకాదు, తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో స్కామ్ ఎలా జరిగిందో అంతా చూస్తూనే ఉన్నామని.. అన్నీ చూచి రాతలే అన్నారు. ఈ పేపర్ లీకేజీ స్కాం వ్యవహారంలో ఎంతమంది అరెస్టు అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయని.. టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితిలో తెలంగాణ ఉందంటూ మరో వ్యాఖ్య కూడా చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు వెంటనే స్పందించారు. బొత్స వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆ రాష్ట్రమేంటో, మా రాష్ట్రమేంటో మాకు తెలియదా? అని ప్రశ్నించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రాజధాని కూడా లేని రాష్ట్రం అది అన్నారు. బొత్స అలా మాట్లాడటం సరికాదని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. గతంలో ఏపీపీఎస్సీలో ఎన్ని స్కాంలు జరిగాయో చూసుకోవాలంటూ బొత్సకు సూచించారు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్పత్రులు కట్టుకున్నారనేది అందరికి తెలుసునని.. ఇప్పటికీ అక్కడివారికి అనారోగ్యం వస్తే చికిత్స కోసం ఎక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు. నెలకొకసారైనా హైదరాబాద్‌కు రాకుంటే ఆయన ప్రాణం ఊరుకోదని.. అలాంటిది హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని బొత్సు శ్రీనివాస్ గౌడ్ హితవుపలికారు.
ఇప్పుడు ఇరు రాష్ట్రాల మంత్రుల వ్యాఖ్యలతో మరోసారి ఏపీ రాజధాని వ్యవహారం తెరపైకి వచ్చింది. ఏపీకి రాజధాని ఏదని గతంలో అదే మంత్రి బొత్సను మీడియా అడిగితే సమాధానం చెప్పలేక కాసేపు నీళ్లు నమిలి త్వరలోనే చెప్తామన్నారు. కానీ, ఏళ్ళు గడిచినా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎక్కడో స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నది. కాగా, ఇప్పుడు అదే మంత్రి బొత్సకి పక్క రాష్ట్రాల నుండి కూడా కౌంటర్లు పడుతున్నాయి. ఒకరకంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరువు తీసేశారు. అలాగే జగన్ పరువుకూడా తీసేశారు. రాజధానే లేని రాష్ట్రం మీరా మమ్మల్ని అనేది అంటూ వైసీపీ నేతలు అందరికీ చురకలంటించారు. దీంతో ఇప్పుడు ఏపీలో మరోసారి రాజధాని అంశంపై చర్చలు సాగుతున్నాయి.
ఇరు రాష్ట్రాల మంత్రుల వ్యాఖ్యలపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం నిదానంగా సాగుతూ, ఐదేళ్లలో నిర్మాణం పూర్తి చేయలేకపోయారని విమర్శించిన వైసీపీ.. ఇప్పుడు చివరికి అసలు రాజధానే లేకుండా రోడ్డున పడేసిందని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అమరావతిని నాశనం చేసేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క అనాలోచిత నిర్ణయంతో రాష్ట్రం ఇప్పుడు రాజధాని లేకుండా మిగిలిపోయింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇప్పుడు ఇలా పక్క రాష్ట్రాల నేతలు సైతం మొత్తం రాష్ట్రాన్ని ఎగతాళిగా మాట్లాడే పరిస్థితి వచ్చిందని కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మంత్రి శ్రీనివాస్ అన్నట్లు వైద్యానికి కూడా ఏపీ ప్రజలు హైదరాబాద్ కు పరుగులు పెట్టడాన్ని కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయమే అనీ.. ఏపీలో వసతుల కొరత ఏ స్థాయిలో ఉందో ఈ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని పేర్కొంటున్నారు. మారి ఈ అంశంలో వైసీపీ నేతల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.