అధికారుల పని ఎస్ బాస్ అనడమే.. గడ్కరీ ఉవాచ
posted on Aug 10, 2022 @ 12:23PM
అధికారం ఎంత పనైనా చేయిస్తుంది. అందుకు ప్రధాని మోడీ అయినా, మంత్రి గడ్కరీ అయినా మినహాయింపు కాదనడానికి తాజాగా గడ్కరీ చేసిన వ్యాఖ్యే నిదర్శనం. అధికారులకు ఉద్యోగ నిబంధనలు బుక్ రూల్ అలాంటివన్నీ ఉన్నా మంత్రులు చెప్పిన దానికి ఎస్ బాస్ అని తీరాల్సిందేనని గడ్కరీ తేల్చేశారు.
విధినిర్వహణలో ఎలా వ్యవహరించాలన్నదానికి అధికారులకు బోలెడు నిబంధనలున్నాయి. వాటిని కాదని మంత్రో, ముఖ్యమంత్రో చెప్పారనీ రూల్స్ ను ఉల్లంఘిస్తే.. మంత్రులకూ ముఖ్యమంత్రులకూ ఏం కాదు. కానీ అధికారులు మాత్రం కోర్టు అక్షింతలు వేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ఉల్లంఘన ఇంకొంచెం తీవ్రమైనదైతే ఉద్యోగానికే ఎసరు రావచ్చు.. కొండొకచో జైలుకూ వెళ్లాల్సి రావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైస్ హయాంలో జరిగిందదే. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో జరుగుతున్నదీ అదే. ప్రభుత్వం చెప్పిన దానికల్లా సరేనంటూ తలలూపేసిన కారణాన పలువురు ఐఎస్ఎస్ అధికారులు కోర్టులలో అక్షింతలు వేయించుకున్నారు.
మొట్టికాయలు భరించారు. సామాజిక సేవా శిక్షను సైతం అనుభవించారు. అయినా సరే వ్యవస్థలలో మంత్రులదే అంతిమ నిర్ణయం అంటున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. మంత్రులు ఏం చెప్పినా.. ఎస్ బాస్ సఅంటూ చేయడమే బ్యూరోక్రాట్ల పని అని తేల్చేశారు. ప్రభుత్వం పని చేసేదే మంత్రుల భాగస్వామ్యంతో అని వారికి హితవు చెప్పారు.
(బ్యూరోక్రాట్లు చెప్పినట్టుగా ప్రభుత్వం పనిచేయదు. మంత్రుల ఆదేశాలకు బ్యూరోకాట్లు ‘యస్ సర్’ అని అనాల్సిందే. అని విస్పష్టంగా చెప్పేశారు. ఏ చట్టం కూడా పేదల సంక్షేమానికి అడ్డుకాదన్న మహాత్మాగాంధీ మాటలను ప్రస్తావిస్తూ, అవసరమైతే చట్టాన్ని పది సార్లు ఉల్లంఘించాల్సి వచ్చినా వెనుకాడేది లేదని గడ్కరీ స్పష్టం చేశారు.