జగన్ మేనత్తకు బుడమేరుకు లింక్ ఏంటి?
posted on Sep 9, 2024 @ 12:32PM
వెల్‌కమ్ టు తెలుగువన్. విజయవాడలో జలప్రళయం కారణంగా ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తమ సర్వస్వం కోల్పోయారు. ఏంటీ బుడమేరు చరిత్ర? పాలకుల పాపాలు ప్రజల పాలిట శాపాలు అని బుడమేరు ఘటనను మనం పేర్కొనవచ్చు. అధికార మదంతో దారుణ పాపాలు పాలకులు చేస్తూ పోతూ బుడమేరును ‘‘బెజవాడ దుఃఖదాయని’’ అని పేర్కొనడం ఎంతవరకు సమంజసం? ‘బుడమేరు’ చిన్నది కాబట్టి ఈ ఏరుకు బుడమేరు అనే పేరు స్థిరపడింది. పరిమాణం చిన్నది అనుకున్నప్పుడు మనం బుడంకాయ, బుడం దోసకాయ, బుడ్డది, బుడ్డాడు అంటాం కదా... అలాగే బుడమేరు అంటే బుడ్డ ఏరు లేదా చిన్న ఏరు అని అర్థంతో దీనికి ఆ పేరు వచ్చింది. బుడం గడ్డి పెరిగే ప్రాంతం కాబట్టి బుడమేరు అనే పేరు స్థిరపడిందనే వాదన కూడా వుంది. మన ‘జపాన్’ సెలవిచ్చినట్టు బుడమేరు ‘నది’ కాదు అని మీకు ఇప్పటికే అర్థమైంది.
కొండ వాగు, పాల వాగు, పంగిడి వాగు, కోతుల వాగు, రామచెరువు వాగు, చవట వాగు, పుల్లమ్మ వాగు, ముగ్గు వాగు, ఎలుగుబోడు వాగు, బందల వాగు, పులి వాగు, లోయ వాగు, గుల్లంతల వాగు, తొమ్మర్ల వాగు, పాముల కాల్వ, తీగల వాగు, పెద్ద వాగు, వన్నేరు, కుంఫిణీ వాగు, పెద్దవర్రి వాగు, గొల్లని వాగు, గుప్త వాగు, చీమల వాగు, తాడి వాగు, నక్కల గండి వాగు... ఇన్ని వాగులు కలిసే ఏరు పేరే బుడమేరు.
కృష్ణాజిల్లాలోని ఎ.కొండూరు మండలంలో విస్తరించిన కొండల శ్రేణిలో జమ్మల వాయుదుర్గం కొండ చాలా ఎత్తయిన కొండ. ఆ కొండ సముద్ర మట్టం నుంచి 1840 అడుగుల ఎత్తులో వుంటుంది. బుడమేరు ఈ కొండలో ఓ చిన్న కొండ వాగుగా పుడుతుంది. ఈ కొండలో పడిన వర్షపు నీరు ఒక వాగుగా ఏర్పడి గంపలగూడెం మండలంలోని నారికంపాడు గ్రామం మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించి, తిరిగి మైలవరం మండలం మెరుసుమిల్లి గ్రామం దగ్గర తిరిగి కృష్ణాజిల్లాలోకి అడుగుపెడుతుంది. ఈ వాగును కొండవాగు అంటారు. పుల్లూరు గ్రామం వద్ద ఈ కొండ వాగులో పాల వాగు అనే వాగు వచ్చి కలుస్తుంది. అక్కడ్నుంచి మైలవరం చేరుకుంటుంది. మైలవరంలో అనంతవరం - పొందుగుల కొండల నుంచి వచ్చే నీరు మైలవరం వాగుగా వచ్చి కలుస్తుంది. ఈ వాగు జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామం తూర్పు పొలిమేర వద్దకు చేరుతుంది. సరిగ్గా అక్కడకు వెల్వడం వాగు వచ్చి చేరుతుంది. ఈ రెండు వాగులు కలిసిన ప్రాంతం నుంచి తనపేరును ‘బుడమేరు’గా పెట్టుకుని, తన గమ్యస్థానం కొల్లేరు సరస్సును చేరుకుని సేదతీరుతుంది. ఎ.కొండూరు మండలం గంపలగూడెం, మైలవరం, జి.కొండూరు, విజయవాడ రూరల్, గన్నవరం మండలం, కంకిపాడు, ఉంగులూరు మండలాలు, బాపులపాడు, గుడివాడ, నందివాడ మండలాల మీదుగా 160 కిలోమీటర్లు ప్రవహించి ఇలపర్రు గ్రామం దగ్గర కొల్లేరులో కలసిపోతుంది. సుమారు 6 వందల అడుగుల వెడల్పుతో మొదలయ్యే బుడమేరు ప్రస్థానం విజయవాడ నగరంలోకి వచ్చేటప్పటికి 20 అడుగుల చిన్న మురికికాలువ చేశారు. ఈ పాపం ఎవరిది? బుడమేరులో లేఔట్లకు పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? అక్రమ కట్టడాలు క్రమబద్ధీకరించింది ఎవరు? పాలకులు కాదా? పాలకుల పాపాలు నేడు బెజవాడకు శాపాలు.
బుడమేరు చరిత్ర గురించి, వర్తమానం గురించి ‘తెలుగువన్’ ఇన్‌పుట్ ఎడిటర్ శుభకర్ మేడసాని ఎంతో ప్రయాసకోర్చి అందించిన గ్రౌండ్ రిపోర్టు చూడండి.. ఎన్నో వివరాలు, విశేషాలు, బుడమేరు పాలిట జరిగిన ద్రోహమేంటి, బుడమేరుకు జగన్ మేనత్తకు వున్న లింక్ ఏమిటీ? వీటికి సంబంధించిన ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్ ఈ క్రింది వీడియో లింక్ ద్వారా చూడండి.