శ్రీకాంతాచారి వర్ధంతి రోజే బీఆర్ఎస్ ఘోర ఓటమి!
posted on Dec 3, 2023 @ 1:55PM
ఉద్యమ పార్టీగా పేరున్న టీఆర్ఎస్, తెలంగాణ ఆవిర్భావం తర్వాత పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారింది. ఆ తర్వాత పేరులోని తెలంగాణను తీసేసి, టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారింది. రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన గులాబీ పార్టీ.. ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయిందని, దానికి మళ్ళీ విముక్తి కలిగించాల్సిన అవసరముందని ఉద్యమకారులు అభిప్రాయబడ్డారు. అందుకు తగ్గట్టుగానే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చూసింది. పైగా ఈ ఫలితాలు శ్రీకాంతాచారి వర్ధంతి నాడు రావడం చర్చనీయాంశమవుతోంది.
మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి. 2009 నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఉద్యమజ్వాలను రగిల్చి అగ్నికి ఆహుతి అవుతూ జై తెలంగాణ అంటూ నినదించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ డిసెంబర్ 3, 2009 న తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి శ్రీకాంతాచారి ఆత్మాహుతి కారణమైంది. ఆ తర్వాత కొంతకాలానికి తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం జరగలేదు. టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో ఆయన తల్లి శంకరమ్మ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఉద్యమకారులను అవమానించిందనే అపవాదు ఎదుర్కొన్న బీఆర్ఎస్.. చివరికి తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి రోజే ఓటమి ఎదురైంది.