వైట్ రైస్.. బ్లౌన్ రైస్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!
posted on Feb 24, 2025 @ 9:30AM
ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే ఆహార పదార్థాలలో బియ్యం ఒకటి. భారతీయులు ఎక్కువగా బియ్యమే ఆహారంగా తీసుకుంటారు. ముఖ్యంగా చాలా ఇళ్లలో తెల్ల బియ్యంతో వండిన అన్నమే ప్రధాన ఆహారం. అన్నం కడుపు నిండుగా ఉంచుతుంది. తృప్తిని ఇస్తుంది. భారతీయులు అన్నానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని.. అన్నాన్ని ప్రసాదించే దేవత అన్నపూర్ణేశ్వరి అని అంటారు. అయితే ఈ మధ్య కాలంలో బ్రౌన్ రైస్ చాలా వైరల్ అవుతోంది. , తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండింటిలోో ఏది ఎక్కువ ప్రయోజనకరం అనే ప్రశ్న చాలామందిలో ఏర్పడింది. ఈ రెండింటిలో ఏది మంచిదో.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుంటే..
ఫైబర్, బరువు నియంత్రణ..
బ్రౌన్ రైస్..
ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎందుకు ముఖ్యం అంటే.. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.
తెల్ల బియ్యం..
ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా ఇది త్వరగా జీర్ణమవుతుంది, తిన్న తరువాత బ్రౌన్ రైస్ తో పోలిస్తే చాలా తొందరగా ఆకలిగా అనిపించవచ్చు. తెల్ల బియ్యం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
బ్లడ్ షుగర్ , డయాబెటిస్ కోసం
బ్రౌన్ రైస్ ..
ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) (~50-55) కలిగి ఉంటుంది. దీని వలన రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు మెరుగైన ఎంపిక.
తెల్ల బియ్యం..
ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (~70-80) కలిగి ఉంటుంది, దీని వలన రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఎంపిక కాదు. డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తక్కువ తినడం మంచిది.
జీర్ణం..
తెల్ల బియ్యం ..
ఇది సులభంగా జీర్ణమవుతుంది, కడుపుకు తేలికగా ఉంటుంది. విరేచనాలు, వాంతులు లేదా కడుపు నొప్పి ఉన్నప్పుడు తెల్ల బియ్యం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.
బ్రౌన్ రైస్..
ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది దీని కారణంగా ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీన్ని చాలా మితంగా తీసుకోవాలి. జీర్ణశక్తి తక్కువ ఉన్నా, బ్రౌన్ రైస్ ను అధిక మొత్తంలో తిన్నా గ్యాస్ లేదా ఉబ్బరం సమస్యలు ఉండవచ్చు.
గుండె ఆరోగ్యం.. కొలెస్ట్రాల్..
బ్రౌన్ రైస్..
ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
తెల్ల బియ్యం..
ఇందులో పోషకాలు, ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి తక్కువ మేలు జరుగుతుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలనుకుంటే, బ్రౌన్ రైస్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ జీర్ణ సమస్యలు ఉంటే బ్రౌన్ రైస్ అంత మంచిది కాదు. తెల్ల బియ్యం కూడా మంచి ఎంపిక. అయితే తెల్ల బియ్యాన్ని పరిమితంగా తీసుకోవాలి.
*రూపశ్రీ.