శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!
posted on Feb 22, 2025 @ 9:30AM
పరమేశ్వరుడిని లయకారుడు అంటారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు. శివారాధనకు సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఇక ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి రోజు శివుడిని ఎంతో గొప్పగా ఆరాధిస్తారు. ఇది మాత్రమే కాకుండా ఏడాదికి ఒకసారి వచ్చే మహా శివరాత్రిని మరింత వేభోగంగా జరుపుకుంటారు. శివపూజలు, శివాభిషేకాలలో ఖచ్చితంగా బిల్వ పత్రి ఉంటుంది. బిల్వపత్రి అనేది మారేడు ఆకులు. మారేడు దళాలు అని కూడా అంటారు. వీటితో పూజ చేస్తే శివుడు చాలా ప్రసన్నం అవుతాడు. శివపూజను సంపూర్ణం చేసే మారేడు దళాలు కేవలం పూజకే కాక.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ మారేడు దళాల వల్ల, మారేడు ఫలాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.
మారేడు దళమే కాదు.. మారేడు చెట్టుకు కాయలు కూడా కాస్తాయి. ఈ కాయలను చాలా మంది పట్టించుకోరు. కానీ ఈ కాయలలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
మారేడు కాయలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలగపండును పోలి ఉంటుంది. వీటి పై భాగం గట్టిగా పెంకులాగా ఉంటుంది. పండు లోపల గుజ్జు ఉంటుంది. ఈ పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతాయి.
మారేడు పండులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మారేడు పండును తీసుకుంటే మంచిది.
మారేడు పండు తింటే వేడి నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో ఎదురయ్యే ఎండ వేడి, హీట్ స్ట్రోక్ వంటి వాటికి మారేడు పండు చక్కని మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...