తెలంగాణలో  భూ పంపిణీ పథకం కనుమరుగు అవ్వబోతోందా?

 

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకంలో భూమి కొనుగోలుకు బ్రేక్ పడింది. భూమి కొనుగోలు బాధ్యత చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్ కొన్ని నెలలుగా భూములను కొనుగోలు చేయటం లేదు. ఎకరాకు సర్కారు ఇస్తున్న మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకు రాష్ట్రంలో ఎక్కడా భూముల దొరక్క పోవడమే ఇందుకు కారణం. భూమి లేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులో సర్కారు దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తొలి దశలో గుంట భూమి కూడా లేని వారికి మూడెకరాలను ఒకట్రెండు ఎకరాలున్న వారికీ మూడు ఎకరాలకు సరిపోయేంతగా భూమి ఇస్తామని ఆ తర్వాత నీటి సదుపాయం, డ్రిప్ సౌకర్యం, విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందుల రూపంలో సమగ్ర ప్యాకేజీని కూడా ఇస్తామని అప్పట్లో సర్కారు వెల్లడించింది. గత ఆరేళ్లలో ఇప్పటి వరకు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలతో పదిహేను వేల రెండు వందల తొంభై తొమ్మిది ఎకరాలను కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు కేవలం ఆరు వేల యాభై ఒకటి మంది దళిత కుటుంబాలకు భూ పంపిణీ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి దాకా రెండు వందల యాభై మూడు మందికి ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాలను పంపిణీ చేశారు. అయితే ఏటికేడు లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది. 

2014-15, 2017- 18 ఆర్థిక సంవత్సరంలో మినహా ఎప్పుడూ వెయ్యి మందికి మించి భూ పంపిణీ జరగలేదు. ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది దళితులు, టీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం సర్కారు ఇచ్చే అరకొర నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా భూమి దొరికే పరిస్థితి లేదు. చిన్న జిల్లాల కావడం, సాగు నీటి వసతి పెరగటం, రియలెస్టేటుతో ధరలకు రెక్కలు రావడంతో రైతులెవ్వరూ భూములను అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడు భూములను కొనేవారున్నారు తప్ప అమ్మేవారు కరువయ్యారని ఎస్సీ సంక్షేమ శాఖలో పని చేసే ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఎకరాకు పది లక్షలు వెచ్చించిన రాష్ట్రంలో ఎక్కడ భూమి దొరికే పరిస్థితి లేకపోవటంతో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తాజాగా సర్కార్ కు ఒక ప్రతిపాదన పంపారు. ఎకరా భూమికి పదిహేను లక్షల రూపాయలు ఇవ్వాలని అలా ఇవ్వగలిగితేనే భూ కొనుగోళ్లు చేయగలుగుతామని అందులో స్పష్టం చేశారు. అయితే భూములు దొరికే పరిస్థితి లేకపోవటంతో ఈ పథకం అధికారికంగా ప్రకటించకుండానే కనుమరుగయ్యే అవకాశం కన్పిస్తోంది. టీఆర్ఎస్ నేతల మాటలు కూడా దీనికి మంగళం పాడినట్టే అనేలా ఉన్నాయి. టీఆర్ఎస్ నేతలు ఇలా అంటుంటే అధికారులు ప్రభుత్వం ఈ పథకం పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ప్రజలు వారంతట వారే ఈ పథకం గురించి మరిచిపోయేలా చేయడమే సర్కార్ అభిప్రాయంగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.దీని పై ప్రభుత్వం ఏం స్పందిస్తుందో వేచి చూడాలి.