పార్టీ నేతలని పొమ్మని బొత్సపోరు దేనికో

 

రాష్ట్రం విడిపోతున్నందుకు బాధ కంటే విడిపోతే తమకు ముఖ్యమంత్రి అవకాశం దక్కుతుందని ఆశపడుతున్నకాంగ్రెస్ నేతలకు కరువు లేదు. అయితే ఆ మాట ఈ పరిస్థితుల్లో చెపితే అసలే ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజలు భగ్గుమంటారనే భయంతోనే వారందరూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. కానీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా, వారు ఎంత మొసలి కన్నీరు కారుస్తున్నా వారి మాటలు వారి మనసులో ఆలోచనలను బయటపెడుతున్నాయి.

 

ముఖ్యమంత్రి పదవిపై చాలా మోజుపడుతున్న వారిలో ప్రప్రధముడు బొత్ససత్యనారాయణ. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా. ఆయన మీడియాతో మాట్లాడుతూ వేరే పార్టీలో టికెట్స్ ఖాయం చేసుకొని పార్టీ వీడే ఆలోచన ఉన్నవారే పార్టీని ప్రజల ముందు దోషిగా చూపుతున్నారని, అటువంటివారి లిస్టు తన వద్ద సిద్దంగా ఉందని, క్రమశిక్షణ ఉల్లంగిస్తే నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. పార్టీని వదిలిపోదలచుకొన్న వారు, శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చేవరకు ఎదురు చూడనవసరం లేదని, నిరభ్యంతరంగా వెంటనే వెళ్లిపోవచ్చునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవికి ఎవరయినా అర్హులేనని అన్నారు.

 

పార్టీ క్రమశిక్షణ ఉల్లంగిస్తే నోటీసులు జారీ చేస్తానని బింకాలు పలుకుతున్నఆయన గత రెండున్నర నెలలుగా నిత్యం అధిష్టానాన్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇంత కాలమయినా ఎందుకు నోటీసులు జారీ చేయలేదు? అదేవిధంగా రెండు రోజుల క్రితం ఆయనే స్వయంగా తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటుస్తానని ప్రకటించారు. మరి అది క్రమశిక్షణ ఉల్లంఘన కాదా?

 

మరి తమ ఇద్దరికీ వర్తించని క్రమశిక్షణ పార్టీలో ఇతరులకే ఎందుకు అవసరం? అంటే పార్టీ నుండి ఎంత మంది వెళ్ళిపోతే తనవాళ్ళకు అంత మందికి పార్టీ టికెట్స్ ఇప్పించుకోవాలని ఉబలాటపడుతున్నట్లుంది. అందుకే పదేపదే పార్టీ నేతలని వెళ్లిపొమ్మని చెపుతున్నారు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి కూడా వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే నేరుగా ఆయనతో ఆ మాటనే దైర్యం, తెగువ లేదు గనుక ఇలా అన్యాపదేశంగా చెపుతున్నారు.

 

ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించాలని అధిష్టానం నిర్ణయిస్తే, ఆ కుర్చీలో కూర్చోవడానికి అందరి కంటే మొట్ట మొదట నిలబడేది ఆయనే. ఒకవేళ ఇప్పుడు కుదరకపోయినా రాష్ట్రం విడిపోయిన తరువాతయినా తన ముఖ్యమంత్రి కల నెరవేర్చుకోవడానికి బొత్స గట్టిగా కృషి చేయడం ఖాయం. ఆయన పట్ల ప్రజలలో ఎంత చులకన భావం ఉందో ఇటీవలే రుజువయింది. అయినప్పటికీ, ఆయన ధోరణిలో ఎటువంటి మార్పు కలిగినట్లు లేదు.