కాంగ్రెస్ పరువు తీసిన బొత్స నోటి దురద

 

మన రాజకీయనాయకులకు అప్పుడప్పుడు ఆవేశంలో నోరు జారడం, ఆ తరువాత అది పీకకు చుట్టుకొన్నాక లబలబలాడుతూ “నేనలా అనలేదు, మీడియా నా మాటలను వక్రీకరించిందని” బుకాయించడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిపోయింది. మీడియా వారు ఆడియో, వీడియో సాక్ష్యాలు చూపించినా “ఆ గొంతు నాది కాదు, ఆ బొమ్మ నాది కాదు” అంటూ అతితెలివిగా వాదిస్తుంటారు.

 

ఇటీవల కాలంలో తరచూ నోరుజారి మీడియాకి దొరికిపోతున్న పీసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ (సత్తి బాబు)వివాదాలకు కేంద్రబిందువయ్యారు. మొన్న9మంది జగన్ విధేయులను పార్టీనుండి బహిష్కరిస్తున్నానని గొప్పగా ప్రకటించిన తరువాత, అది కోతి పుండు బ్రహ్మరాక్షసి అయినట్లు, తిరిగి తిరిగి మళ్ళీ అయన పీకకే చుట్టుకొంది.

 

అసలే నామ మాత్రపు మెజార్టీతో నిలబడున్న ప్రభుత్వాన్ని కిరణ్ కుమార్ రెడ్డి అతికష్టం మీద నెట్టుకువస్తుంటే, బొత్స సత్యనారాయణ ప్రకటనతో అది కాస్తా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ప్రస్తుతం డిల్లీలో ఉన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇదే విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులకు పిర్యాదు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం సత్తిబాబును తెలంగాణా చర్చలపేరిట వెంటనే డిల్లీకి రప్పించి బాగా తలంటనున్నదని సమాచారం.

 

చివరికి తన మాటలు తన పదవికే ఎసరు తెచ్చేట్లు ఉందనే వాస్తవాన్ని గ్రహించిన సత్తిబాబు మాట మార్చి తాను శాసన సభ్యులను (జగన్ అనుచరులను) పార్టీ నుండి బహిష్కరించినట్లు చెప్పలేదని, సోనియాగాంధీ నాయకత్వం, కాంగ్రెస్ సిద్దాంతం ప్రకారం నడచుకోలేని వారు ఎవరయినా సరే కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేనివారిగా తానూ భావిస్తున్నానని చెపితే, మీడియా తన మాటలను వక్రీకరించి తానూ ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు వార్తలు వ్రాసి తనను ఇబ్బందులోకి నెట్టిందని ఆయన అన్నారు.

 

మొత్తం మీద ఆయన బహిష్కరణ ప్రకటనతో తన పరువే కాక, పార్టీ పరువును కూడా గంగలో కలిపారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నజగన్ అనుచరుల విషయం ఇంతవరకు ప్రతిపక్షాలు గానీ, స్వయంగా జగన్ గానీ ఎవరూ ప్రస్తావించకపోయినా, ఆయన స్వయంగా ఆ అంశాన్నితన ప్రకటనతో లేవనెత్తి, జగన్ అనుచరులను పార్టీ నుండి బహిష్కరించలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రతిపక్షాలు విమర్శించేందుకు అవకాశం కల్పించారు. జగన్ మోహన్ రెడ్డి చెపుతున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఆయన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి నడుస్తోందనే నిజాన్ని బొత్స సత్యనారాయణ తన వాచాలత్వంతో మరో మారు నిరూపించి, ప్రతిపక్ష పార్టీల దృష్టిలో కాంగ్రెస్ పార్టీ మరింత అలుసయిపోయేలా చేసారు.

 

ఇక, ఈ అంశం ఇక్కడితో ముగిసిపోతే ఆయన అదృష్టవంతుడేనని అనుకోవచ్చును. కానీ, అది తన పదవిని బలితీసుకొంటే, మీడియా ముందు బుకాయించినా, ఆనక తలుపులేసుకొని తీరికగా పశ్చాతాపపడకతప్పదు.