సీమంధ్ర కాంగ్రెస్ నేతల కొత్త డ్రామా
posted on Oct 5, 2013 @ 8:21PM
ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరో సరికొత్త డ్రామా మొదలయింది. సీమంధ్ర నేతలలో కొంత మంది పదవులకోసం ఆశపడుతూ రాష్ట్ర విభజనకు కేంద్రానికి సహకరించారని కొందరు ఆరోపిస్తుంటే, కాదు వారే మమ్మల్ని చివరి నిమిషం వరకు మభ్యపెడుతూ రాష్ట్ర విభజనకు కారకులయ్యారని మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఈ కొత్త డ్రామా మొదటి అంకంలో ప్రధాన పాత్రదారులుగా లగడపాటి, బొత్స సత్యనారాయణ తెరపైకి వచ్చారు. త్వరలోనే మిగిలిన పాత్రదారులు కూడా ముందుకు రావచ్చును. లగడపాటి మీడియాతో మాట్లాడుతూ కొందరు మంత్రులు పదవులకు ఆశపడి సమైక్యఉద్యమానికి ద్రోహం చేసారని, సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బహిర్గతం చేస్తానని అన్నారు.
జరుగుతున్న పరిణామాలు గమనిస్తే లగడపాటి బొత్సను ఉద్దేశ్యించే అని ఉంటారని అర్ధం అవుతుంది. రాష్ట్ర విభజన జరగడానికి బొత్స సత్యనారాయణే కారకుడని బలంగా నమ్ముతున్న సమైక్యవాదులు ఆయనకు చెందిన ఆస్తులపై దాడులు చేస్తున్నారు. ఎనాడూ చిన్న సంఘటన కూడా ఎరుగని ప్రశాంత పట్టణంగా పేరుగాంచిన విజయనగరం నేడు యుద్దభూమిగా మారిపోయింది. చివరికి కర్ఫ్యూకూడా విదించాల్సి వచ్చింది. అయినా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.
దీనితో తీవ్ర ఆగ్రహం చెందిన బొత్స తనపై పార్టీలో కొందరు లేనిపోని ప్రచారం చేస్తూ తనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం వెలువడగానే అందరూ కలిసి కట్టుగా రాజీనామాలు చేసి రాజ్యంగ సంక్షోభం సృష్టించి, రాష్ట్రవిభజనను అడ్డుకొందామని చెప్పినప్పుడు పార్టీలో కొందరు పెద్దమనుషులు విభజనను అడ్డుకొనేందుకు తగిన ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని భరోసా ఇస్తూ, చివరికి వారే రాష్ట్ర విభజనకు పరోక్షంగా సహకరించి, ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రులను, శాసనసభ్యులను, చివరికి యంపీలను కూడా రాజీనామాలు చేయవద్దని వారిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి బొత్స ఈ మాటలు అని ఉంటారని అర్ధం అవుతోంది.
ముందు రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించిన బొత్స, ఆ తరువాత అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చివచ్చారు. ఆ తరువాత తిరుపతి వెళ్లినప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని దేవుడిని ప్రార్దించానని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. మళ్ళీ మొన్న కిరణ్-భాదిత మంత్రుల సంఘం సమావేశంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయం తీసుకొని, అదేమాట దిగ్విజయ్ సింగ్, షిండే చెవిలో వేసేందుకు డిల్లీలో వాలారు.
అంతవరకు టీ-నోట్ పై రకరకాల కధలు చెపుతూ వచ్చిన షిండే, దిగ్విజయ్ సింగ్, బొత్స తమ చెవిన వేసిన వార్త తరువాత కేవలం టేబిల్ నోట్ మాత్రమే క్యాబినెట్లో ప్రవేశపెట్టబోతున్నట్లు మీడియాకు లీకులిస్తూ, ఎప్పుడో తయారు చేసి సిద్దంగా ఉంచిన 22 పేజీల సమగ్రమయిన టీ-నోట్ ను క్యాబినెట్లో ప్రవేశపెట్టడం, వెంటనే దానిని మంత్రి మండలి ఆమోదించేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అందువల్ల ఇక టీ-నోట్ శాసనసభ ఆమోదం కోసం రావడం కూడా అనుమానమే.
ఇటువంటి నేపధ్యంలో ఇప్పుడు బొత్స తాను నిర్దోషినని సంజాయిషీలు ఇచ్చుకొంటూ, ఇతరులను నిందించడం విశేషం. నిజం చెప్పాలంటే తిలాపాపం తలోపిడికెడు అన్నట్లు రాష్ట్ర విభజన పాపంలో మొత్తం సీమంధ్ర కాంగ్రెస్ నేతలందరికీ భాగం ఉంది. కానీ ప్రజలను మభ్యపెట్టే పనిలో మళ్ళీ ఈ కొత్త డ్రామకి తెర తీసారు. దానిని ప్రజలు ఇంకా గుడ్డిగా నమ్ముతారని వారు గుడ్డిగా నమ్ముతున్నారు. ఏది ఏమయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వీరందరూ ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం.