రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం 

Publish Date:Nov 24, 2024

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 25 (సోమవారం)  నుంచి ప్రారంభం కానున్నాయి.  ఈ  నేపథ్యంలో  అఖిల పక్ష సమావేశం ఆదివారం జరిగింది.  కేంద్ర పార్లమెంటరీ  వ్యవహారాల శాఖామంత్రి కిరణ్ రిజిజు  పార్లమెంటు ఉభయసభల్లో వివిధ రాజకీయ పార్టీల  నేతలతో సమావేశమయ్యారు. కేంద్ర  రక్షణ మంత్రి  రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆదాని పై అమెరికాలో కేసు నమోదు కావడంపై చర్చించాల్సింది కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ నేత ప్రమోద్ మహజన్ తెలిపారు.   పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి మొదలై డిసెంబర్ 20 వరకూ కొనసాగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవమైన  నవంబర్ 26న పార్లమెంటు సెషన్ జరగదు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై  ఏర్పాటైన  పార్లమెంట్ సంయుక్త  కమిటీ ఈ నెల 29న తన తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. 

జగన్ బెయిలు రద్దు.. సీబీఐ స్టాండ్ మారిందా?

Publish Date:Nov 12, 2024

జగన్ బెయిలు రద్దు పిటిష్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ జరిగింది. రఘురామకృష్ణం రాజు సుప్రీంలో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి జగన్ బెయిలు రద్దు చేయాలన్నది కాగా, రెండోది జగన్ అక్రమాస్తుల కేసు విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని. ఈ కేసుల విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలిగారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు మరో బెంచ్ ముందు డిసెంబర్ 2న విచారణకు రానుంది.  అయితే ఆసక్తికర పరిణామమేంటంటే.. సీబీఐ తరఫున ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిలు రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం అడిగారు. అలా అడగడమే సీబీఐ జగన్ బెయిలు రద్దు విషయంలో ఇంత వరకూ మెయిన్ టైన్ చేస్తూ వస్తున్న స్టాండ్ ను మార్చుకుంటుందా అన్న అనుమానాలకు తావిస్తోంది.  ఎందుకంటే జగన్ సీఎంగా ఉన్నంత కాలం ఆయన బెయిలు విషయంలో సీబీఐ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.   అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ సీఎం కాదు. కేవలం పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే. దీంతో ఇప్పటి వరకూ జగన్ బెయిలు విషయంలో అభ్యంతరాలు చెప్పని సీబీఐ ఇప్పుడు వైఖరి మార్చుకుని ఆయన బెయిలు రద్దు కోరే అవకాశం ఉంది. అలా కాకపోతే కనీసం కేసు రోజువారీ విచారణ కోరే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా జగన్ ఇబ్బందుల్లో పడక తప్పదు.   గతంలో జగన్ బెయిలు విషయంలో సీబీఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన దేశం విడిచి పారిపోరన్న గ్యారంటీ , బెయిలు షరతులు ఉల్లంఘించరన్న నమ్మకం ఉండేది. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. అందుకే మారిన పరిస్థితుల్లో సీబీఐ కూడా తన స్టాన్స్ మార్చుకునే అవకాశం ఉంది. అందుకే జగన్ కు ఇబ్బందులు తప్పవన్న భావన న్యాయవర్గాలలో ఎదురౌతోంది. జగన్ బెయిలు రద్దైనా, కేసుల విచారణను రోజువారీ చేపట్టాలని నిర్ణయించినా జగన్ జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.  

సొంత పార్టీ శ్రేణులకే వెగటు పుట్టిస్తున్న జగన్ రెడ్డి అతితెలివి!

Publish Date:Nov 13, 2024

అంత నీతే వుంటే ఇంత సంతెందుకు? అని వైసీపీ శ్రేణులే జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం కన్నూ మిన్నూ కాననట్లుగా ప్రత్యర్థులపై కక్షసాధింపు కోసమే అధికారం అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత కూడా తానే ముఖ్యమంత్రి అన్న భ్రమల్లోనే గడుపుతూ క్యాడర్ ను కష్టాల పాలు చేస్తున్నారన్న చర్చ వైసీపీ నేతల్లోనే జరుగుతోంది. వైసీపీ అధినేత‌, పులివెందులఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరులో ఏమాత్రం మార్పురావ‌డం లేదు. ఇంకా మేమే అధికారంలోనే ఉన్నాం.. తానే ముఖ్య‌మంత్రి  అన్న‌ట్లుగా ఆయ‌న‌ వ్య‌వ‌హిస్తుండ‌టం పట్ల వైసీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. జ‌గ‌న్ మ‌నం దారుణంగా ఓడిపోయాం.. ఇప్ప‌టికైనా వాస్తవంలోకి రండి అంటూ వైసీపీ నేత‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. త‌న‌ను న‌మ్ముకున్న వైసీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా అరెస్ట్ అవుతుంటే.. జ‌గ‌న్ మాత్రం కూట‌మి ప్ర‌భుత్వాన్ని మ‌రింత రెచ్చ‌గొడుతూ ఇంకా అరెస్టు చేయం డి చూస్తా అంటూ స‌వాల్ చేస్తుండ‌టంతో వైసీపీ నేత‌ల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటున్నది. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌తో విసిగిపోయిన ఏపీ ప్ర‌జ‌లు.. ఎన్నిక‌ల్లో వైసీపీకి కేవ‌లం ప‌ద‌కొండు సీట్లు మాత్ర‌మే ఇచ్చారు. దీంతో ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా చేశారు. నిజంగా ప్ర‌జ‌ల‌కోసం పోరాడే మ‌న‌స్త‌త్వ‌మే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఉండిఉంటే అసెంబ్లీకి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడాలి. కానీ, జ‌గ‌న్  మాత్రం.. నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వండి అప్పుడే అసెంబ్లీకి వ‌స్తా అంటూ మారం చేయ‌డం చూసి వైసీపీ శ్రేణులే జ‌గ‌న్ తీరు ప‌ట్ల‌ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో చంద్ర‌బాబు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అసెంబ్లీకి వెళ్లి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడారు. కానీ, జ‌గ‌న్ మాత్రం అసెంబ్లీకి వెళ్లే సాహసం చేయ‌కపోవడం ఆయ‌న పిరికిత‌నాన్ని ఆయనే స్వయంగా బ‌హిర్గ‌తం చేసుకున్న‌ట్ల‌యింది. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై జ‌గ‌న్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి పొంత‌న‌లేని వ్యాఖ్య‌లు చేసి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల విషయంలో ఏపీ శ్రీలంకలా మారు తోందంటూ  కూటమి నేతలు ప్రచారం చేశారన్న వైఎస్ జగన్.. వైసీపీ హయాంలో ఏపీ అప్పులపై గోబెల్స్ ప్రచారం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్‌తోనూ అబద్ధాలు చెప్పించార‌ని,  సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టేందుకే ఈ ప్రచారం చేశారన్నారు.  తెలుగుదేశం హయాంలో ఆంధ్రప్రదేశ్ అప్పులు 19 శాతం పెరిగితే,  వైసీపీ పాలనలో 15 శాతం మాత్రమే పెరిగాయని చెబుతూ తన ఐదేళ్ల పాలనలో చేసిన  త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. త‌న ఐదేళ్ల పాల‌న‌లో స‌చివాల‌యాన్ని సైతం అప్పుల కోసం తాక‌ట్టు పెట్టిన విష‌యాన్ని జ‌గ‌న్ మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. అయితే, జ‌గ‌న్ ఏపీలో పెట్టుబ‌డుల విష‌యంపై మాట్లాడుతూ, కూట‌మి ప్ర‌భుత్వంలో ఏపీకి వ‌స్తున్న పెట్టుబ‌డుల‌న్నీ వైసీపీ హ‌యాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న‌వే అంటూ  ఎలాంటి బిడియం లేకుండా చెప్పుకున్నారు.  జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే.. ఏపీ ప్ర‌జ‌లు అమాయ‌కులు.. తాను ఏది చెప్పినా గుడ్డిగా న‌మ్మేస్తారని భావిస్తున్న‌ట్లుగా కనిపిస్తోంది. జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో గ‌తంలో టీడీపీ హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్టిన పెద్ద‌పెద్ద కంపెనీల‌ను వెళ్ల‌గ‌ట్టిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాని కొత్త‌గా చెప్పుకోద‌గ్గ ఒక్క కంపెనీ జ‌గ‌న్ హ‌యాంలో ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌లేదు. ఇందుకు కూడా చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని జ‌గ‌న్  చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులే జీర్ణించుకోలేకపోతున్నాయి. జ‌గ‌న్ అబ‌ద్దాలు చెప్పి ప‌బ్బంగ‌డుపుకునేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదని వైసీపీ నేతలే ప్రైవేటు సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో మాట్లాడితే నిజాలన్నింటినీ అక్కడిక్కడ బయట పెడతారన్న భయంతోనే జ‌గ‌న్ అసెంబ్లీకి డుమ్మా కొట్టి  మీడియా స‌మావేశం పెట్టి ఏక‌ప‌క్షంగా కూట‌మి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం చూస్తుంటే అస‌లు ఆయ‌న ఓ పార్టీకి అధ్య‌క్ష‌డా అనే సందేహాన్ని ఏపీ ప్ర‌జ‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వంతో రిలయన్స్ చేసుకున్న ఎంవోయూలకు వైసీపీ హయాంలోనే  అడుగులు పడ్డాయని జగన్ చెబుతున్నారు.  దానికి సాక్ష్యం ఏమిటంటే.. అంబానీతో కలిసి జగన్ నవ్వుతూ నిల్చున్న ఫోటోనే అంటున్నారు. ఏ మాత్రం ఆలోచించకుండా  తనకు ఇషుమంతైనా సంబంధం లేని క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకోవడమే కాకుండా.. ఆ ఫోటోలు ప్రదర్శించడం విస్తోపోయేలా చేస్తోంది.   తన హయాంలోనే అంబానీ, అదానీ, టాటా, బిర్లాలు ఏపీకి వ‌చ్చార‌ని, ఎనిమిది కీలక ప్రాజెక్ట్‌లకు కీలక అడుగులు పడ్డాయ‌ని చెప్పుకొచ్చిన జ‌గ‌న్‌,  కూట‌మి ప్ర‌భుత్వంలోనే అన్ని తీసుకొచ్చినట్లు చంద్ర‌బాబు నాయుడు బిల్డప్‌ ఇచ్చుకుంటున్నారని  అన‌డం ప‌ట్ల వైసీపీ శ్రేణులు సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాయి. వైసీపీ హ‌యాంలో ఏపీ నుంచి  కంపెనీల‌ను వెళ్ల‌గొట్టి ఇప్పుడు ఇంత ప‌చ్చిగా అబ‌ద్దాలు ఎలా మాట్లాడుతున్నావ్‌ అన్నా అంటూ వైసీపీ నేత‌లే జ‌గ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్న పరిస్ధితి. ఐదేళ్లు అబ‌ద్దాల‌తో పాల‌న సాగించి కేవ‌లం 11 స్థానాల‌కే ప‌రిమితం అయ్యాం.. ఇంకా అబ‌ద్దాల‌తో నే పబ్బం గడుపుకోవాలంటే పార్టీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంద‌ని జ‌గ‌న్ తీరుప‌ట్ల వైసీపీ నేత‌లు అసహనం వ్య‌క్తం చేస్తున్నారు.

పేరెంట్స్ జాగ్రత్త.. తండ్రిని చూసి పిల్లలు నేర్చుకునే అలవాట్లు ఇవీ.. !

Publish Date:Nov 23, 2024

పిల్లలకు తమ తండ్రే మొదటి హీరో.. సాధారణంగానే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు.  తల్లిదండ్రులు చేసే పనులను తాము కూడా  అలవాటు చేసుకుంటారు. అందుకే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తుందని చెబుతారు.  కానీ కొన్ని పనులు తండ్రులు మాత్రమే చేసేవి ఉంటాయి.  వాటిని పిల్లలు కూడా నేర్చుకుంటారు.  చిన్నతనంలో నేర్చుకునే కొన్ని విషయాలు పిల్లలు జీవితాంతం పాటించేవిగా ఉంటాయి.  అలాంటి కొన్ని అలవాట్లు తల్లిదండ్రుల నుండి కూడా నేర్చుకుంటారు.  ఇంతకీ పిల్లలు తండ్రి నుండి నేర్చుకునే అలవాట్లు ఏమిటి? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రతి తండ్రి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. గౌరవం.. ఇతరులను గౌరవించడం అనేది పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు.  ముఖ్యంగా తండ్రి ప్రవర్తన ద్వారా ఇది పిల్లలకు ఎక్కువగా అలవడుతుంది. ఎందుకంటే ఇంటి పెద్దగా తండ్రిని భావిస్తారు.  బయటి వారి నుండి పెద్దలు,  కుటుంబ సభ్యులు,  చివరకు భార్య,  పిల్లలను గౌరవించడం అనేది కూడా అతను చేయాల్సిందే.. ఒక మగవాడు ఇలా అందరినీ గౌరవిస్తూ ఉంటే అతని పిల్లలు కూడా గౌరవించడాన్ని నేర్చుకుంటారు.  కానీ కొందరు మగవారు పురుషాహంకారంతో అసభ్యంగా, కఠినంగా,   అవమానకరంగా మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసం.. కుటుంబాన్ని తన భుజాల మీద మోసేది తండ్రి.  తన భాద్యతగా భార్య, పిల్లలు,  తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వ్యక్తి అతనే.. కష్ట సమయాలలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం నుండి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం వరకు అతని ఆత్మవిశ్వాసమే పిల్లలకు ప్రేరణ అవుతుంది.  పిల్లలు కూడా తమ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోగు చేసుకుంటారు. ఇతరుల మాట వినడం.. తను మగవాడు.. పైగా ఇంటికి పెద్ద.. ఇంటి బరువు భాద్యతలు మోస్తున్నవాడు.. అలాంటి వాడు ఇతరుల మాట వెంటే చిన్నతనమైపోతాడు అనే ఫీలింగ్ చాలా మంది మగవారికి ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు.. మొదట భార్య మాట,  తల్లిదండ్రుల మాట తరువాత మంచి చెప్పే ఎవరి మాట అయినా వినాలి.  ఇలా వినే స్వభావం అతనికి ఉంటే అతన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అతను ఎవ్వరిమాట లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలు కూడా ఎవరి మాట వినకుండా నిర్లక్ష్యంగా తయారవుతారు. శారీరక శ్రద్ద.. ఇప్పటి జీవనశైలిని అనుసరించి ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది శారీక కార్యకలాపాలలో భాగం కావాలి.  ఇప్పట్లో శారీరక శ్రమ తక్కువ,  మానసిక శ్రమ ఎక్కువ. కాబట్టి వీలు చూసుకుని శారీరక వ్యాయామం, నడక,  ఫిట్ నెస్ కార్యాచరణలో నిమగ్నం అవ్వాలి. దీన్నిచూసి పిల్లలు కూడా శారీరక ఫిట్ నెస్ మీద శ్రద్ద చూపిస్తారు. కుదిరితే పిల్లలతో కలసి ఫిట్‌నెస్ కార్యకలాపాలు కొనసాగించాలి. ఇంటి పనులు.. కొంతమంది మగవారు ఈ పనులు ఆడవారే చెయ్యాలి..  ఈ పనులు మగవారే చెయ్యాలి అనే గీత గీసుకుని ఉంటారు. ఇంతకు ముందుకాలంలో ఉద్యోగం చేసే మహిళలు తక్కువ. కానీ ఇప్పటి కాలం మహిళలు ఉద్యోగాలు చేస్తూ  ఇంటి పనులు చక్కబెడుతుంటారు.  మహిళలకు చేదోడుగా మగవారు కూడా పనులలో భాగస్వామ్యం అవుతుంటే దాన్ని చూసి పిల్లలు కూడా తల్లికి సహాయపడటం, ఇంటి పనులు చేయడం నేర్చుకుంటారు. భర్త పిల్లలు ఇంటి పనులలో సహాయపడితే ఏ భార్య అయినా తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. అలాంటి ఇల్లు కూడా ఎప్పుడూ సంతోషంతో కళకళలాడుతూ ఉంటుంది. పైగా పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి. దీని వల్ల ఇంటిల్లిపాది కలసి సంతోషంగా గడపడానికి సమయం కూడా దొరుకుతుంది.                                                  *రూపశ్రీ.
[

Health

]

కంటిచూపు నుండి మధుమేహం వరకు.. 300 సమస్యలకు చెక్ పెట్టే ఆకు ఇది..!

Publish Date:Nov 23, 2024

  టెక్నాలజీ పెరిగాక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి.  శరీరం కష్టపడకుండా ఉద్యోగాలు చేసుకుంటే హాయిగా ఉండవచ్చని చాలా మంది అనుకుంటారు.  కానీ దీని వల్ల జబ్బుల రాజ్యం ఉదృతమైంది. కంటి సంబంధ సమస్యలు, మధుమేహం, ఊబకాయం,  మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఆహారంతోనే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.  ముఖ్యంగా గ్రామాలలోనూ, పట్టణాలలోనూ విరివిగా పెరిగే మునగ చెట్ల నుండి మునక్కాయలు కాస్తాయని అందరికీ తెలుసు.  వీటిని డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అయితే మునగ ఆకులను కూడా ఆహారంలో తీసుకోవచ్చు. పచ్చిగా ఉన్న ఆకులను తీసుకోలేని పక్షంలో ఎండిన మునగ ఆకులను అయినా  పొడి చేసి వినియోగించవచ్చు. ఇంతకీ మునగ ఆకులలో ఉండే పోషకాలేంటి? ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది తెలుసుకుంటే.. పోషకాలు.. మునగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మునగ ఆకుల్లో ఐరన్, కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఎ తో పాటు  అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా  ఉంటాయి. ఐరన్,  కాల్షియంతో పాటు, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి, ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.  ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక వరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  మునగ ఆకులను ఆహారంలో తీసుకుంటే300 రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మునగ ఆకులు చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి,  శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయి. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా,  రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. మునగ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు,  ఇతర ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి మునగ ఆకులను  తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. విటమిన్ సి కాకుండా ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది.  ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రభావవంతంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి మునగ ఆకులు చక్కని పరిష్కారం. మునగ ఆకుల్లో మంచి మొత్తంలో ఫైబర్  ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా మునగ  ఆకులు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి.  జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మునగ ఆకులలో కాల్షియం,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు  చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఎందుకంటే మహిళలు తరచుగా ఐరన్,  కాల్షియం లోపాన్ని ఎదుర్కొంటారు. మునగ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి,  బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మునగ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. విటమిన్ ఎ తీసుకోవడం కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.  కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, రేచీకటి  వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది,  వయస్సుతో వచ్చే బలహీనతలను నివారిస్తుంది.                                                      *రూపశ్రీ.