జానారెడ్డి ఓటమే బీజేపీ లక్ష్యమా?
posted on Mar 30, 2021 @ 11:43AM
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తుండగా.. అధికార టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ బరిలో ఉన్నారు. అభ్యర్థి విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్.. చివరికి నోముల వారసుడినే ఫైనల్ చేశారు. బీజేపీ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్ లో తమ అభ్యర్థిగా డాక్టర్ పనుగోతు రవికుమార్ నాయక్ ను ఖరారు చేసింది. నాగార్జున సాగర్ జనరల్ నియోజకవర్గమైనా.. ఎస్టీని బరిలోకి దింపి పెద్ద సాహసమే చేసింది కమలదళం.
నాగార్జున సాగర్ లో బీజేపీ అభ్యర్థిగా రవి కుమార్ నాయక్ ఎంపికపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సాగర్ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా చూస్తే.. లంబాడీల ఓట్లే ఎక్కువ. సాగర్ లో మొత్తం 2 లక్షల 17 వేల ఓటర్లుండగా.. లంబాడీ ఓటర్లే దాదాపు 41 వేలు ఉన్నారు. ఈ ఈక్వేషన్ ఆధారంగానే రవి కుమార్ నాయక్ కు బీజేపీ బరిలోకి దింపిందంటున్నారు. నియోజకవర్గంలో గిరిజనుల తర్వాత యాదవులే ఎక్కువ. టీఆర్ఎస్ నుంచి భగత్ యాదవ్ పోటీ చేస్తున్నారు. రెడ్లు దాదాపు 34 వేల వరకు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీలో ఉన్నారు. అందుకే బీజేపీ ఎస్టీకి ఇచ్చి కొత్త ప్రయోగం చేసిందని చెబుతున్నారు.
నాగార్జున సాగర్ లో సర్వేలు నిర్వహించిన వివిధ సంస్థలు మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రవి నాయక్ తో ఎవరికి నష్టమనే చర్చ జరుగుతోంది. స్థానిక రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం బీజేపీ ఎస్టీ అభ్యర్థిని దింపడం వల్లే కాంగ్రెస్ క్యాండిడేట్ జానారెడ్డికే నష్టమని చెబుతున్నారు. అందుకు గల లెక్కలు కూడా వివరిస్తున్నారు. గతంలో ఉన్న చలకుర్తి, ప్రస్తుత నాగార్జున సాగర్ నుంచి సెగ్మెంట్ నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు గెలిచారు జానారెడ్డి. సాగర్ నియోజకవర్గంలో హాలియా, త్రిపురారం, నిడమనూర్, పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్, గుర్రంపోడ్ మండలాలున్నాయి. త్రిపురారం, తిరుమలగిరి సాగర్ మండలాల్లో గిరిజనుల ఓట్లు మెజార్టీ. ఈ మండలాలకు చెందిన గిరిజనుల మద్దతు ఉండటం వల్లే జానారెడ్డి ఏకపక్ష విజయాలు సాధించారని చెబుతారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గిరిజన తండాల్లో జానారెడ్డికి పట్టు ఉందని అంటున్నారు.
గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే త్రిపురారం మండలం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. త్రిపురారం మండలంలో గిరిజనుల ఓటర్లు ఎక్కువ. అందుకే ఆ మండలంలో జానారెడ్డికి ప్రతి ఎన్నికల్లో మంచి లీడ్ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 వేల 5 వందల ఓట్లతో జానా రెడ్డి ఓడిపోయినా.. త్రిపురారం మండలంలో మాత్రమే ఆయనకే లీడ్ వచ్చింది. గిరిజనుల ఓట్ల వల్లే జానాకు అక్కడ లీడ్ వచ్చింది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రవి నాయక్... ఎక్కువగా ఎస్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. అదే జరిగితే జానారెడ్డికే నష్టమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు రవి నాయక్ సొంత మండలం కూడా త్రిపురారమే. సో.. జానారెడ్డికి పట్టున్న మండలం ఇదే కావడం, బీజేపీ అభ్యర్థి ఈ మండలం వ్యక్తే కావడం కూడా కాంగ్రెస్ కు మైనస్ గా మారే అవకాశం ఉంది.
బీజేపీ నేతలు కూడా ఈ అంశాలను ఆధారంగా చేసుకునే రవి నాయక్ ను బరిలోకి దింపారంటున్నారు. సాగర్ టీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటు. నోముల కుటుంబంపై సానుభూతి కూడా ఉంది. దీంతో భగత్ గెలిచినా బీజేపీకి పెద్ద ఇబ్బంది ఉండదు. సెంటిమెంట్ కలిసిరావడంతో తన సిట్టింగ్ సీటును అధికార పార్టీ గెలిచిందని కవర్ చేసుకోవచ్చు. అదే కాంగ్రెస్ గెలిస్తే బీజేపీకి చాలా నష్టం. సాగర్ లో జానా రెడ్డి గెలిస్తే.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటుంది. అది జరిగితే బీజేపీకి నష్టం. కాంగ్రెస్ బలహీనం అయితేనే తెలంగాణలో బీజేపీకి బలపడే అవకాశం ఉంటుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందే చేతులెత్తేయడం వల్లే ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతా బీజేపీకి పడి.. ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే సాగర్ లో టీఆర్ఎస్ గెలిచినా ఫర్వాలేదు కాని... కాంగ్రెస్ గెలవొద్దనే ఎత్తుగడతో బీజేపీ తన అభ్యర్థిని ఎంపిక చేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.