ప్రాణం తీసిన పకోడీ..
posted on Mar 30, 2021 @ 11:42AM
పకోడి 16 ఏళ్ళ బాలుడి ప్రాణం తీసింది. అదేంటి పకోడి ప్రాణం తీయడం ఏంటీ అనుకుంటున్నారా.. అది అంతే.. ఆలస్యం అయిందని ఒక మూర్ఖుడు ఆ బాలుడ్ని చ*పేశాడు. తండ్రికి పకోడి బండి ఉంది. బడికి సెలవులు ఉన్నపుడు శివ తండ్రికి సాయంగా బండి దగ్గరకు వెళ్తాడు. ఒక వ్యక్తి తాను మందు తాగుతూ మటన్ పకోడి తెమ్మని శివకు చెప్పాడు. అసలే మనది మందు బాబుల దేశం గిరాకీ ఎక్కువ ఉండడం వల్ల.. ఆ వ్యక్తి చెప్పిన టైం కి పకోడి తీస్కపోలేదు శివ. ఇక అంతే నేరుగా తన స్కార్పియోతో వచ్చి వాళ్ళ బతుకు బండిని డీ కొట్టాడు.. అంతటితో ఆగక ఇనుప రాడ్డుతో కొట్టాడు. చికిత్స పొందుతూ ఆ 16 ఏళ్ళ బాలుడు మృతిచెందాడు.
కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో శింగం ఏసుకు మాంసం పకోడి బండి ఉంది. కొడుకు శివ(16) తండ్రికి చేదోడు వాదోడుగా బండి వద్ద ఉంటాడు. సెలవురోజు అవ్వడంతో ఆ రోజు రాత్రి తండ్రి వద్ద ఉన్నాడు. వీరికి దగ్గర్లోనే కొవ్వూరి వీరబాబు మద్యం తాగుతున్నాడు. తనకు పకోడి తీసుకురమ్మని శివతో వీరబాబు చెప్పాడు. ఎన్ని పనులున్నాయి పాపం శివకి కొంచం లేట్ అయింది. ఇక అంతే వెంటనే తీసుకువెళ్లకపోవడంతో వీర బాబు లో ఉన్న రాక్షసుడు బయటికి వచ్చాడు. తన స్కార్పియో వాహనంలో వెళ్లాడు. తిరిగి వచ్చి నేరుగా పకోడి బండిని కారుతో ఢీకొట్టాడు. దాంతో శివ(16)కు తీవ్రంగా గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా ఆ బాలుడిని వీరబాబు ఇనుప రాడ్డుతో కొట్టడంతో శివ కుప్పకూలిపడిపోయాడు.
దీంతో శివను కాకినాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. ఈ విషయం తెలియగానే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసులు గ్రామంలో మోహరించారు. కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మృతుని కుటుంబాన్ని పలువురు పరామర్శించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అప్పలరాజు తెలిపారు.