బీజేపీ వ్యూహం ఆగమాగం.. హుజురాబాద్‌లో కింకర్తవ్యం?
posted on Sep 30, 2021 @ 4:51PM
ఘనంగా సభ పెట్టాలనుకున్నారు. జాతీయ నేతలను రప్పించాలనుకున్నారు. వీలైతే అమిత్‌షా.. కుదిరితే జేపీ నడ్డా. హుజురాబాద్‌లో బహిరంగ సభతో ఊదరగొట్టాలని భావించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడతను హుజురాబాద్‌లో ముగించాలని అనుకున్నారు. అందుకు అక్టోబర్ 2న ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆ సభతో ఘనంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని అనుకున్నారు. కానీ, తామొకటి తలిస్తే.. ఎన్నికల కమిషన్ ప్రకటనతో సీన్ మరోలా మారిపోయింది. అట్టహాసం, మందీమార్బలం.. ఏమీ లేకుండానే బండి సంజయ్ ఫస్ట్ రౌండ్ పాదయాత్ర ముగించాల్సి వస్తోంది. జాతీయ నేతలూ వచ్చే పరిస్థితి లేదు. హుజురాబాద్ అనుకుంటే హుస్నాబాద్‌లోనే సింపుల్ సభతో సరిపెట్టాల్సి వస్తోంది. దీంతో.. ఈటల రాజేందర్ తరఫున బీజేపీ పెద్దగా హంగామా చేసి.. ఆయన వెనుకు కాషాయదళమంతా ఉందనే మెసేజ్‌ను ఘనంగా చాటుదామనుకుంటే ఆ ఐడియా ఇప్పుడు బెడిసికొట్టింది. ఈసీ విధించిన కొవిడ్ నిబంధనలే వీటన్నిటికీ కారణం. ఇంతకీ ఈసీ నిబంధనలు ఏంటంటే....
* స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో పాల్గొంటే బహిరంగ సభలు అయితే వెయ్యి మంది వరకు, లేక సమావేశ స్థలంలో 50 శాతం సామర్థ్యంతో ఏది తక్కువైతే ఆ సంఖ్యతో సభను నిర్వహించాల్సి ఉంటుంది. సభల వద్ద హాజరైన వారి సంఖ్యను లెక్చించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తారు.
* స్టార్ క్యాంపెయినర్లు కాకుండా ఇతరులు ప్రచారం చేస్తే సమావేశస్థలంలో పట్టే జనం సంఖ్యలో సగంగానీ 500 మందికి మించకుండా గానీ ఉండాలన్న నిబంధన విధించారు. ఈ సభల చుట్టూ పోలీసు వలయాన్ని ఏర్పాటు చేస్తారు.
* ఇండోర్ మీటింగ్ నిర్వహిస్తే సీటింగ్ సామర్థ్యంలో 30 శాతం మేరకు లేదా 200 మందికి మించకుండా వీటిలో ఏది తక్కువైతే ఆ నిబంధన మేరకు సమావేశాన్ని నిర్వహించుకో వచ్చు. సభ్యులను లెక్కించేందుకు రిజిస్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
* రోడ్‌షోలకు, బైక్, కార్లు, సైకిల్ ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోగా ఇంటింటి ప్రచారం నిర్వహించేందుకు అభ్యర్థితోపాటు ఐదుగురు మాత్రమే ఉండాలని నిబంధన విధించారు.
* వీధి సమావేశాల్లో స్థలం అందుబాటును బట్టి 50 మందికి అనుమతి ఇస్తారు. వీడియో వ్యాన్ల ప్రచారాలకు కూడా స్థలం అందుబాటును బట్టి 50 మందికే అనుమతి ఉంటుంది.
* అభ్యర్థి, అతని రాజకీయ పార్టీ 20 వాహనాలను మాత్రమే వినియోగించుకునేందుకు ఆ వాహనాల్లో 50 శాతం సీటింగ్ సామర్థ్యాన్ని మాత్రమే వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
* ఈసారి పోలింగ్ ముగిసే సమయానికి 72 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. అంటే పోలింగ్ జరిగే రెండున్నర రోజుల ముందే మైక్ ప్రచారం నిలిచిపోనున్నది.
ఎన్నికల కారణంగా కొవిడ్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇలా కఠినమైన నిబంధనలను విధించింది. దీంతో.. బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు సభ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు హుజురాబాద్‌లో జరపాలని నిర్ణయించారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసి పాదయాత్ర ముగింపు సభను హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి శ్రీకార సభగా మార్చాలని ఆ పార్టీ భావించింది. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని కూడా ఆ పార్టీ ప్రచారం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు హుజురాబాద్ పరిధిలో ఈనెల 1 నుంచి వర్తించనున్నందున పాదయాత్ర ముగింపు సభను అక్కడ కాకుండా హుస్నాబాద్‌లో నిర్వహించాలని భావిస్తోంది. ఇంకా వేదిక ఖరారుకాకున్నా హుజురాబాద్‌లో మాత్రం సభ ఉండదని తేలిపోయింది.
బీజేపీ బహిరంగ సభ, జాతీయ నాయకత్వం రాకతో.. తన గెలుపునకు ఎంతో బూస్ట్ వస్తుందనుకున్న ఈటల రాజేందర్ డ్రీమ్స్‌కు ఈసీ నిబంధనలతో చెక్ పడినట్టైంది. ఇన్నాళ్లూ కాషాయ జెండాల నీడలో ఒంటరి పోరాటం చేసిన ఈటలకు.. కీలక సమయంలో పార్టీ అండాదండా దొరక్కుండా ఈసీ రూల్స్ అడ్డుగోడలా నిలిచాయని అంటున్నారు. దీంతో ఎప్పటిలానే తన గెలుపునకు తానే కష్టపడాల్సి వస్తోంది. వచ్చే నెల రోజులూ అధికార పార్టీ దూకుడును, వ్యూహాలను తట్టుకొని.. ఈటల రాజేందర్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి...