కాంగ్రెస్ లో ఉండను.. బీజేపీలో చేరను! ప్రాంతీయ పార్టీ దిశగా పంజాబ్ మాజీ సీఎం..
posted on Sep 30, 2021 @ 6:16PM
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్ అమరీందర్ సింగ్ మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంటున్నానని, పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అదే సమయంలో తమ టిట్టర్ హేండిల్ నుంచి కాంగ్రెస్ ను తొలిగించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో 52 ఏళ్ళపాటు సాగిన కెప్టెన్ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది. అవును ఆయన కాంగ్రెస్ చేయి వదిలేస్తున్నారు. కానీ, చాలా మంది ఉహించిన విధంగా ఆయన కమలం గూటికి చేరడం లేదు. బీజేపీలోచేరడం లేదు. ఒక టీవీ చానల్ ప్రతినిధి, మీరు బీజేపీలో చేరుతున్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కెప్టెన్ సింగ్.. “నేను బీజేపీలో చేరడం లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీని వదిలేస్తున్నాను. ఆ పార్టీలో ఉండి అవమానాలు భరించలేను” అని స్పష్టం చేశారు. అయితే ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి ఊహాగానలకు వదిలేశారు.
పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నవజ్యోతి సింగ్ సిద్దుకు సంబందించి అడిగిన ప్రశ్నకు, “సిద్దూకు పీసీసీ చీఫ్’కు ఉండవలసిన స్థిరత్వం లేదు” అని అన్నారు. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన నాయకత్వ సంక్షోభం గురించి అడిగిన ప్రశ్నకు, కెప్టెన్ అమరీందర్, “కాంగ్రెస్ పార్టీ పతనం వైపుగా పరుగులు తీస్తోంది” అని వ్యాఖ్యానించారు. అయితే కెప్టెన్ అమరిందర్ సింగ్, బీజేపీలో చేరక పోయినా, ఆయన కమల దళానికి దగ్గరవుతున్నారు. బుధవారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో వివాదస్పద వ్యవసాయ చట్టాల గురించి సుదీర్ఘంగా చర్చించిన ఆయన, ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు, అజిత్ దోవల్ తో సమావేశమయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సమయంలో కూడా, అమరీందర్ సింగ్, పాక్ సరిహద్దుల వద్ద ఉన్న భయంకర పరిస్థితి, ఆ మార్గంలో రాష్ట్రంలోకి అక్రమంగా వస్తున్న ఆయుధాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో అజిత్ దోవల్ తో అమరీందర్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదలా ఉంటే కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరేది లేదని స్పష్టం చేసిన నేపధ్యంలో ఆయన ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారని వస్తున్న ఊహాగానాలకు బలంచేకురుతోందని అంటున్నారు.మరో వంక కాంగ్రెస్ పార్టీ ఇటు అమరీందర్ సింగ్’తో అటు సిద్దూతోనూ సంప్రదింపులు జరుతోందని సమాచారం. ఇందులో భాగంగానే మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, కేంద్ర మాజీ మంత్రి అంబికాసోనీ కెప్టెన్ సింగ్’తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అమరీందర్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారని సమాచారం.ఈ సందర్భంగానే, “అవమానాలు భరించడం నావల్ల కాదు” అని ఆయన ఆన్నారని సమాచారం. మరో వంక సిద్దూ ముఖ్యమంత్రి చన్నీని కలిశారు. అధిష్టానం జోక్యం లేకుండా ఆ ఇద్దరు ఒక అంగీకరానికి వచ్చే అవకాశం ఉందని, కొత్త ఫార్ములాతో ఆ ఇద్దరు కలిసి పనిచేస్తారని అంటున్నారు. అదే జరిగితే సిద్దూ మళ్ళీ మరో యూ టర్న్ తీసుకుంటారని వేరే చెప్పనక్కర్లేదు.