బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్
posted on Aug 23, 2022 @ 3:12PM
ఘోషామహల్ ఎమ్మెల్యేపై బీజేపీ వేటు వేసింది. స్టాండప్ కమేడియన్ మునావర్ షోను హైదరాబాద్ లో నిర్వహించరాదంటూ ఆందోళనకు దిగిన రాజాసింగ్.. ఆ తరువాత విడుదల చేసిన ఒక వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వ్యాఖ్యలు ఉండటంతో హైదరాబాద్ లో ఆందోళనలు చెలరేగాయి. రాజా సింగ్ అరెస్టు డిమాండ్ చేస్తూ కమిషనర్ కర్యాలయాన్ని కూడా ముట్టడించారు.
రాజా సింగ్ వ్యాఖ్యలు మతసామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులనన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న బీజేపీ మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించినందుకు రాజా సింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించినందకు పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించరాదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
అంతకు ముందు ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు సోమవారం ( ఆగస్టు 22) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాజా సింగ్ వీడియో విడుదల చేసిన అనంతరం సోమవారం హైదరాబాద్ లో నిరసనలు వెల్లువెత్తాయి. ఏకంగా కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ఎదుటే నిరసనకారులు ఆందోళనకు దిగారు. అలాగే నగర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆందోళనలు జరిగాయి.
రాజాసింగ్ తమ మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆయనను అరెస్టు చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. దీంతో పలు చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులను అదపులోనికి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ పై కేసు నమోదైంది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే కమేడియన్ మునావర్ ఫరూకీ హైదరాబాద్ లో స్టాండప్ కామెడీ షో నిర్వహిస్తే తానూ కామెడీ వీడియోను విడుదల చేస్తానని రాజా సింగ్ హెచ్చరించారు.
ఆ నేపథ్యంలోనే మునావర్ కామోడీ షోకు పోటీగా రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.