బీజేపీకి షాక్.. రైతు చట్టాలను వ్యతిరేకించే తీర్మానానికి ఎమ్మెల్యే సపోర్ట్
posted on Dec 31, 2020 @ 4:34PM
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అటు రైతులు ఇటు ప్రతి పక్షాలు ఉద్యమాలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేస్తున్నాయి. తాజాగా కేరళ రాష్ట్ర అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అయితే కేరళలో బీజేపీ తరుఫున ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ కూడా ఈ బిల్లుకు మద్ధతు పలకటం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన తర్వాత కూడా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతుల పక్షాన నిలిచిన ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా తన పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, సాయంత్రానికి ఎమ్మెల్యే ఓ.రాజగోపాల్ యు టర్న్ తీసుకుని.. తను అలా అనలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.