ముస్లిం మంత్రితో నీతిష్ ఆలయ ప్రవేశం.. మండిపడుతున్న బీజేపీ
posted on Aug 23, 2022 @ 5:19PM
అపలే దేశంలో రాజకీయపరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నాయి. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వీలు చిక్కినపుడల్లా విపక్షాల మీద విరుచుకుపడటమో, ఈడీ, సిబిఐలను ఉసిగొల్పడమో చేస్తోంది. ఈ సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గయలోని విష్ణుపధ్ ఆలయంలోకి ఒక ముస్లిం మంత్రితో కలిసి వెళ్లి మరీ పూజలు చేశారు. బీహార్‌లో బీజేపీకి ఝలక్ ఇచ్చిన నితీష్‌పై పగ సాధిం చడానికి బీజేపీ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో బీజేపీ కి ఈ విధంగా నీతిష్ దొరికడంతో రాష్ట్రం లో రాజకీయ దుమారం చెలరేగింది.
నితీష్ కుమార్‌ను తప్పుపడుతూ బీజే పీ విమర్శలు గుప్పించింది. గయలో మంగళవారం అధికార పర్యట నకు వెళ్లిన నితీష్ కుమార్ తనతో పాటు సమాచార, సాంకేతిక శాఖ మంత్రి మొహమ్మద్ ఇజ్రాయిల్ మన్సూరీని కూడా విష్ణుపద్ ఆలయ దర్శనానికి తీసుకువెళ్లారు. కలిసి పూజలు చేశారు. అనంతరం మన్సూరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రితో కలిసి విష్ణుపద్ ఆలయ గర్భగుడిలో పూజలు చేయడం తన అదృష్టం గా భావిస్తున్నానని చెప్పారు.
కాగా, హిందూయేతరులకు ప్రవేశం లేదని ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన నోటీసు విషయాన్ని తాము మన్సూరి దృష్టికి తెచ్చామని, అయినప్పటికీ ఆయన ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
ఈ ఘనటపై హిందుత్వవాది, బీజేపీ ఎమ్మెల్యే థాకూర్ బచౌల్ మండిపడ్డారు. ఇది మతవిశ్వాసాలకు సం బంధించిన అంశమని అన్నారు. హిందూయేతరులకు ఆలయ ప్రవేశంపై నిషేధం ఉందని స్పష్టంగా చెప్పినప్పటికీ ఆయన (మన్సూరి) దృష్టికి తీసుకువచ్చినప్పటికీ , ఆయన బేఖాతరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ విభాగం ప్రతినిధి నిఖిల్ ఆనంద్ మాట్లాడుతూ, హిందువుల మనో భావా లను నితీష్ గాయపరచిచారని, ఆలయ వ్యవస్థను అవమానించారని అన్నారు.
స్థానిక పూజారుల ఆచరించే పద్దతులు, పురాతన మత సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసేందుకు నితీష్ కుమార్ ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని, ప్రపంచవ్యాప్తంగా హిందూ విశ్వాసాలు, సనాతన ధర్మంపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికీ నితీష్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలతో ముస్లింలను ప్రసన్నం చేసు కు నే ప్రయత్నాలు గర్హనీయమని అన్నారు.
కాగా, బీజేపీ నేతల వాదనను హిందుస్థాని అవామ్ మోర్చా (హెచ్ఏఎం) కొట్టిపారేసింది. బీజేపీ మత తత్వవాద వ్యాప్తి పూర్తిగా అభ్యంతరకరమని హెచ్ఏఎం జాతీయ ప్రతినిధి దినేష్ రిజ్వాన్ అన్నారు. సమాజంలో విషపూరిత వాతావరణాన్ని బీజేపీ నేతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వారి మతతత్వ ఎజెండా వ్యాప్తిని సాగనిచ్చేది లేదని చెప్పారు.