ప్రచారం ఓకే.. పరనింద వద్దు.. రామ్ దేవ్ బాబాకు సుప్రీం చురకలు
posted on Aug 23, 2022 @ 5:32PM
అల్లోపతి, ఆయుర్వేదం, యూనాని ఇలా వైద్య విధానాలు వేరైనా అన్నిటి లక్ష్యం మాత్రం రోగికి స్వస్థత చేకూర్చడం, రోగాన్ని నియం చేయడమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫలానా వైద్య విధానమే అత్యుత్తమమైదని ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ, ప్రచారం పేరుతో మరో వైద్య విధానాన్ని దూషించడం, కించపరచడం ఎంత మాత్రం తగదు. ఇదే విషయాన్ని దేశ సర్వోన్నత న్యాయ స్థానం యోగాగురి బాబా రాందేవ్ కు సుతిమెత్తగానైనా స్పష్టంగా చెప్పింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్బంగా యోగాగురు బాబా రామ్ దేవ్ పై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. యోగా గురు బాబా రామ్ దేవ్ అల్లోపతి వైద్యులను నిందించడం తగదని చురకలు వేసింది. ఇప్పటికే యోగాకు ప్రాచుర్యం, ప్రజాదరణ రావడంలో బాబా రామ్ దేవ్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ, అలాగే ఆయుర్వేదానికి కూడా ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు ప్రచారం చేసుకుంటే తప్పులేదనీ, అయితే ఆ పేరుతో అల్లోపతిని నిందించడం, దూషించడం, అల్లోపతి వైద్యులను కించపరచడం తగదని మందలించింది.
కోవిడ్ సంక్షోభ సమయంలో రామ్ దేవ్ అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న పలువురు వైద్యులు మరణించారనీ, అల్లోపతి ఒక మూర్ఖ వైద్య విధానమనీ రామ్ దేవ్ అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఇలా ఉండగా మీరు అనుసరించే వైద్య విధానం అన్ని రోగాలు, రుగ్మతలూ నయం చేస్తుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా అని సుప్రీం కోర్టు రామ్ దేవ్ బాబాను ప్రశ్నించింది. మీ వైద్య విధానాన్ని ప్రచారం చేసుకోవడం వరకూ ఓకే కానీ ఇతర వైద్య విధానాలను దూషించడం తగదని పేర్కొంది.