మహాకూటమిదే బీహార్? ఎగ్జిట్ పోల్స్ లో లీడ్
posted on Nov 7, 2020 @ 8:59PM
హోరాహోరీగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో మహా ఘట్ బంధన్ కూటమికే ఆధిక్యం కనిపిస్తోంది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాఘట్ బంధన్ కూటమికి 100 నుంచి 115... బీజేపీ, అధికార జేడీయూలతో కూడిన ఎన్డీయే కూటమికి 90 నుంచి 110 స్థానాలు... ఎల్జేపీకి 3 నుంచి 5 స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది. టైమ్స్ నౌ-సీ ఓటర్ సర్వేలో ఎంజీబీ కూటమికి 120... ఎన్డీయే కూటమికి 116, ఎల్జేపీకి 1, ఇతరులకు 6 స్థానాలు దక్కుతాయని తేలింది.
ఎంజీబీ కూటమికి 108 నుంచి 131 స్థానాలు, ఎన్డీయేకి 104 నుంచి 128 స్థానాలు లభిస్తాయని ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ప్రకటించింది. రిపబ్లిక్ జన్ కీ బాత్ సర్వేలో... ఎంజీబీ కూటమికి 118 నుంచి 138 స్థానాలు, ఎన్డీయే కూటమికి 91 నుంచి 117 స్థానాలు, ఎల్జేపీకి 5 నుంచి 8 స్థానాలు, ఇతరులు 3 నుంచి 6 స్థానాలు గెలుస్తారని అంచనా వేశారు. అయితే అన్ని సర్వేల్లోనూ రెండు కూటముల మధ్య తేడా మాత్రం చాలా స్వలంగానే ఉంది. దీంతో ఫలితాల్లో ఏదైనా జరగవచ్చని భావిస్తున్నారు. మూడు దశల్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 60 శాతం వరకు పోలింగ్ జరిగింది.