జగన్ కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
posted on Apr 3, 2021 @ 12:47PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జగన్ కు గుడ్ బై చెప్పేశారు ఆ పార్టీ కీలక నేత. తన నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల ప్రకారం వైసీపీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. జాతీయ పార్టీలో చేరాలనుకుంటున్నానని ఆ నేత తెలిపారు. తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిలకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. కీలక నేత రాజీనామా చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది.
వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి. తన జీవితంలో ఇది దుర్దినం అన్నారు. సామాన్యుడిగా ఉన్న తనకు రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్ నియమించారని చెప్పారు. జాతీయ పార్టీలో చేరి భవిష్యత్ లో హుజూర్ నగర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని తెలిపారు. 2007 నుంచి తనకు జగన్ తో సంబంధం ఉందన్నారు శ్రీకాంత్ రెడ్డి. అప్పుడు కాంగ్రెస్ లో చేరి.. తర్వాత వైఎస్ జగన్ తో కలిసి నడిచానని తెలిపారు. వైఎస్ జగన్ భవిష్యత్ లో ఇంకా గొప్ప స్థానాలు అధిరోహించాలని కోరుకున్నారు గట్టు.
తెలంగాణలో పోరాటాలు చేయలేదనే ఆరోపణలు తమపై వచ్చాయన్నారు గట్టు శ్రీకాంత్ రెడ్డి. రాష్ట్రం వచ్చి ఏడు సంవత్సరాలైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక పోవడం అన్యాయమన్నారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా వైసీపీలో కలకలం రేపుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. అంతేకాదు టీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు అన్యాయం చేస్తున్నా వైసీపీ స్పందించలేదని కామెంట్ చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడవద్దని జగన్ ఆదేశించారనే సంకేతం వచ్చేలా గట్టు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేయడం, మిగిలిన వారు షర్మిలకు మద్దతుగా ఉంటుండటంతో తెలంగాణలో వైసీపీ దుకాణం బంద్ అయినట్టేననే చర్చ జరుగుతోంది.