ఇక జనంలోకి నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి
posted on Sep 14, 2023 @ 10:27AM
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆగ్రహ జ్వాలలతో రాష్ట్రం రగిలిపోతున్నాది. చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా యువగళం పాదయాత్రకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రేక్ ఇచ్చారు. అయితేచంద్రబాబు కుటుంబం జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు అక్రమ అరెస్టును, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ప్రజలలోకి మరింతగా తీసుకువెళ్లేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంది.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఇక జనంలోకి రానున్నారు. జగన్ ప్రభుత్వ అరాచక పాలనను, అక్రమ అరెస్టులు కేసులతో రాష్ట్రంలో భయానకవాతావరణం సృష్టిస్తున్న తీరునూ ప్రజలలో ఎండగట్టే ఉద్దేశంతో వీరిరువురూ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ పాదయాత్రకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు తెలుగుదేశం ముఖ్య నాయకులతో రాజామహేంద్రవరంలో నారా లోకేష్ భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇక భువనేశ్వరి, బ్రాహ్మణి పాదయాత్రపై గురువారం (సెప్టెంబర్ 14) సాయంత్రానికి ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఈ లోగా లోకేష్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో భేటీ అనంతరం నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. లోకేష్ తో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. కాగా ఇప్పటికే నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును జగన్ సర్కార్ వేధిస్తున్న తీరును ప్రజల కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. రెండు రోజుల కిందట జైల్లో చంద్రబాబును భువనేశ్వరి బ్రాహ్మణి కలిసిన సంగతి తెలిసిందే. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడిన భువనేశ్వరి ఏమీ లేని ఒక కేసులో చంద్రబాబును ఇరికించి.. జైల్లో ఆయన కట్టించిన భవనంలోనే కట్టి పారేశారనీ, ఎటువంటి సౌకర్యాలూ లేవనీ, ఆయన భద్రతపై కూడా తన ఆందోళన ఉందనీ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా భువనేశ్వరి జైలు నుంచి బయటకు వస్తుంటే తనలో ఒక భాగాన్ని అక్కడే వదిలేసినట్లు ఉందని అనడం అందరినీ కదిలించింది.
ఆ తరువాత కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ సందర్భంగా సీఐడీ కౌంటర్ కు సమయం కోరడంతో చంద్రబాబు అరెస్టును సమర్ధించుకునేలా ఒక్క ఆధారం కూడా సీఐడీ వద్ద లేదన్న సంగతి సర్వులకూ అర్ధమైపోయింది.
ఈ నేపథ్యంలోనే నారా భువనేశ్వరి, బ్రహ్మణిలు పాదయాత్ర చేయాలని, జనంలో మమేకమై జగన్ సర్కార్ దురాగతాలను, కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలలో ఎండగట్టాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అదీ కాక భువనేశ్వరి తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎక్కడకూ పోదనీ, జనంతోనే ఉంటుందనీ, తన భర్త జనం కోసమే తపిస్తున్నారనీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, కష్టాలు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తారని చెప్పడమే కాదు.. చంద్రబాబు భార్యగా, ఎన్టీఆర్ కుమార్తెగా మీకు హామీ ఇస్తున్నాను అని కూడా చెప్పారు. ఆ మేరకే ఇప్పుడు ఆమె జనంలోకి రావడానికి సంసిద్ధమయ్యారు అని పరిశీలకులు చెబుతున్నారు.