స్కిల్ త్రైపాక్షిక ఒప్పందమేనని సీఐడీ చీఫ్ ఒప్పుకోలు.. తడబాటుతో నవ్వుల పాలు!
posted on Sep 14, 2023 @ 10:02AM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అరెస్టుకు ఒక్క ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. న్యాయ నిపుణులు చంద్రబాబును ఏపీ సర్కార్ అరెస్టు చేసిన తీరుపై దిగ్భ్రమ వ్యక్తం చేస్తున్నారు. సమస్త విలువలకూ తిలోదకాలిచ్చి.. అరెస్టు చేయడమే లక్ష్యం అన్నట్లుగా నమోదు చేసిన కేసులు, కోర్టులో వాదనలపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి వీఆర్ విత్ సీబీఎన్ అంటూ ఆందోళన బాట పట్టారు.
జాతీయ స్థాయిలో రాజకీయాలకు అతీతంగా నేతలంతా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ గురువారం (సెప్టెంబర్ 14) రాజమహేంద్రవరం వచ్చి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఉన్నారు. ఇక రోజు రోజుకూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు, నిరసనలూ జోరందుకుంటున్నాయి. చంద్రబాబు తన అరెస్టుపై దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయడానికి సీఐడీ సమయం కోరడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. అసలు ఎందుకు అరెస్టు చేశారో, నిబంధనలు ఏమిటో, నమోదు చేసిన సెక్షన్లు ఏమిటో తెలియకుండానే అరెస్టు చేసి ఇప్పుడు సమర్ధించుకోవడానికి దారి లేక వాయిదాలు కోరుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ సీఐడీ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందనీ, అడ్డగోలు అరెస్టులు కేసులతో వైసీపీ వ్యతిరేకులను, జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలను విమర్శిస్తున్న వారిని వేధించడానికే పరిమితమైందన్న విమర్శలను ఎదుర్కొంటున్నది.
కోర్టులు కూడా పలు సందర్భాలలో సీఐడీ తీరును తప్పుపట్టాయి. అయినా అధికార వైసీపీ అగ్రనేతల కనుసన్నలలో పని చేయడానికి అలవాటు పడిపోయిన సీఐడీ తీరు మారడం లేదు. చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా నిబంధనలకు తిలోదకాలిచ్చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరి వాంగ్మూలం ఆధారంగా అయితే చంద్రబాబును అరెస్టు చేశామని సీఐడీ చెబుతోందో ఆ మాజీ ఐఏఎస్ అధికారే సీఐడీ ప్రకటనను తప్పుపట్టారు. ఇక టెక్ డిజైన్ సంస్థ తాము స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు పరికరాలు అందించామనీ, సీమెన్స్ తో కలిసి అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఎటువంటి అవకతవకలూ లేవని ఆ సంస్థ ఎండీ కుండబద్దలు కొట్టారు.
ఇక సకల శాఖల మంత్రి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీమెన్స్ కు అసలు స్కిల్ తో సంబంధం లేదని చెప్పడాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి ఆధారాలతో సహా ఎండగట్టారు. అయినా వైసీపీ సర్కార్ మాత్రం పాత పాటనే పాడుతోంది. ఆధారాలు చూపమంటే దాట వేస్తూ.. సీఐడీ ఆరోపణలనే పదేపదే చెబుతూ గొబెల్స్ ప్రచారం చేస్తున్నది. అయితే తెలుగుదేశం నాయకులు ఆధారాలతో సహా బయటపెడుతుండటంతో ప్రజలకు వాస్తవం బోధపడి స్వచ్ఛందంగా చంద్రబాబుకు సంఘీభావంగా రోడ్లపైకి వస్తున్నారు.
ఇంతకీ అసలు స్కిల్ కేసుతో సీమెన్స్ కు సంబంధం లేదంటూ సజ్జల వంటి వారు, వారి మాటలకు వంత పాడుతున్నట్లుగా సీఐడీ సిమెన్స్ పేరును అడ్డగోలుగా తెలుగుదేశం వాడేస్తోందనీ, ఆ ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ సంస్థే చెప్పిందంటూ సజ్జల మాటలనే సీఐడీ చెబుతోంది. ఇందుకు సంబంధించి వైసీపీ అనుకూల మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ ప్రాజెక్టుతో సీమెన్స్ కు సంబంధం లేదన్నది ఆ వార్తల సారాంశం, సీఐడీ కూడా అదే చెబుతూ వస్తోంది. కానీ కోర్టులలో తమ అసంబద్ధ వాదన నిలవదు, అసలు వాస్తవం బయటపడుతుందన్న భయమో ఏమో కానీ.. సీఐడీ చీఫ్ మీడియా సమావేశంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సీమెన్స్ సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకుందని, ఆ సంస్థకు రూ. 58 కోట్లు అందాయని అంగీకరించారు.
తమ ఆరా అంతా మిగిలిన సొమ్ముగురించేనంటూ చెప్పుకువచ్చారు. ఇప్పటి వరకూ అసలు సీమెన్స్ కు సంబంధం లేదని వాదిస్తూ వచ్చిన సీఐడీ ఇప్పుడు టెక్ డిజన్ సంస్థలా సీమెన్స్ కూడా మీడియా ముందుకు వస్తుందోమోనన్న భయంతో మాట మారుస్తోంది. అసలు స్కిల్ డెవలమ్ మెంట్ సెంటర్లు పని చేయలేదని చూపేందుకు చంద్రబాబు అరెస్టు తరువాత వాటికి తాళాలు వేస్తోంది. మొత్తం మీద గుడ్డ కాల్చి ముఖాన వేసి ఆ మసి మీరే తుడుచుకోవాలన్నట్లు జగన్ సర్కార్, ఏపీ సీఐడీ తీరు ఉంది. అయితే స్వాష్ పిటిషన్ తో వైసీపీ సర్కార్ కుట్రలన్నీ తేటతెల్లం అయ్యాయి. కౌంటర్ కు వారం గడువు అడగడంతోనే సీఐడీ వద్ద ఈ కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క ఆధారం లేదని తేటతెల్లమైపోయిందని న్యాయ నిపుణులు అంటున్నారు.
ఇక సీఐడీ కస్టడీ పిటిషన్ పై విచారణ చేపట్టవద్దని హైకోర్టు ఏసీబీ కోర్టును ఆదేశించడంతో.. సీఐడీ అక్రమంగానే చంద్రబాబు విషయంలో వ్యవహరించిందన్నది రుజువైపోయినట్లేనని న్యాయనిపుణులు అంటున్నారు. మరో వారం పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉంటే ఉండొచ్చు కానీ ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడి పులుకడిగిన ముత్యంలా తిరిగి వస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.