భూతల నరకం బెంగళూరు.. నీటిలోనే జనజీవనం
posted on Sep 6, 2022 7:59AM
దేశంలోనే అత్యంత ప్రశాంత నగరంగా, ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు ఇప్పుడు భూతల నరకంగా మారిపోయింది. రహదారులు చెరువులయ్యాయి. భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణికింది. దారీ తెన్నూ కానరాక జనం నానా అవస్థలూ పడుతున్నారు. నగరంలో ఏ దారి చూసినా గోదారే అన్నట్లుగా తయారైంది. భారీ వర్షాలకు రహదారులు, హైవేలు మునిగాయి.
కాలనీల్లోకి నీళ్లు వచ్చి చేరి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగులు బస్సుల్లో కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి మారి.. వారే బస్సును కార్యాలయానికి తోసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజులుగా బెంగళూరు నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఉద్యోగులు బస్సుల్లోనూ, కార్లలోనూ కాకుండా కార్యాలయాలకు వెళ్లడానికి ట్రాక్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ అధికారంలో ఉన్నకర్నాటకలో అడ్మినిస్ట్రేషన్ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికి గత మూడు రోజులుగా బెంగళూరు వాసులు అనుభవిస్తున్న కష్టాలే నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇండియన్ సిలికాన్ వ్యాలీ కడలిలా మారిపోయింది. భారీ వర్షాలకు బెంగళూరు నగరం నీటమునిగింది. అత్యంత కీలకమైన ఐటీ కారిడార్ లో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఆదివారం సుమారు 20.44 సెంటీమీటర్ల వర్షం పడటంతో నగరంలో చిగురుటాకులా అల్లల్లాడింది. నివాసాలు, ఐటీ కార్యాలయాల్లోకి మోకాల్లోతు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు ఔటర్ వద్ద భారీగా ప్రవహిాస్తున్న నీటిలోనే అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అంబులెన్స్ వెళ్లాల్సి రావడం నగరంలో భయానక పరిస్థితికి అద్దం పడుతోంది.
ఒక్క వానకే బెంగళూరు మునిగిపోవడంపై నగరవాసులు అధికార బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తమను ఆదుకోమంటూ ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. పూర్తిగా నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు. వార్తర్ రోడ్డుతోపాటు బెల్లాందుర్, సార్జాపుర రోడ్డు, వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, బీఈఎమ్ఎల్ లేఔట్ వంటి ఏరియాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ ప్రాంతాల్లో వర్షపు నీరు వరద ప్రవాహాన్ని తలపిస్తోంది. ఈ నెల 9 వరకు కర్ణాటకలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.