వర్షాకాలంలో పెరుగు తినడం మంచిది కాదా? నిజానిజాలేంటంటే..!
posted on Jul 17, 2024 @ 9:30AM
సీజన్ ను బట్టి కొన్ని ఆహారాలు చేర్చుకోవాలని, కొన్ని అవాయిడ్ చేయాలని చెబుతూ ఉంటారు. అలా వర్షాకాలంలో తినకూడదు అని కొందరు చెప్పే వాటిలో పెరుగు ఉంటుంది. వర్షాకాలంలో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటూ ఉంటారు. అయితే ఇది ఎంత మాత్రం నిజం? దీని వెనుక కారణాలు ఏమిటి? నిజానిజాలు ఏమిటి? అనేది పూర్తీగా తెలుసుకుంటే వర్షాకాలంలో పెరుగు తినాలా వద్దా అనేది అర్థమైపోతుంది. చాలామంది ఈ వర్షాకాలంలో పెరుగు ఎందుకు తినకూడదో కొన్ని కారణాలు చెప్తారు. అవి ఎంత వరకు వాస్తవమూ తెలుసుకుంటే..
వర్షాకాలంలో పెరుగు తినవచ్చా..?
వర్షాకాలంలో ఆహారంలో గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు తినడం చాలా మంచిది. నిజానికి ఇందులో ఉండే ప్రోబయోటిక్ కాంపోనెంట్ వల్ల సీజన్ తో సంబంధం లేకుండా జీర్ణకోశ సంబంధిత రుగ్మతలను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి వర్షాకాలంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగు తినవచ్చు.
వర్షాకాలంలో పెరుగు జీర్ణం కాదా?
పెరుగులో ఉండే ప్రోటీన్ లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ కారణంగా ఇది పాల కంటే సులభంగా జీర్ణమవుతుంది. పచ్చి పాలలో కంటే పెరుగులో ఉండే పెప్సిన్ ద్వారా కేసైన్ ప్రోటీన్ ఎక్కువగా జీర్ణమవుతుంది. కాబట్టి వర్షాకాలంలో పెరుగు తినడం చాలా మంచిది.
రాత్రి సమయంలో పెరుగు తినకూడదా?
రాత్రిపూట పెరుగు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుంది. ఇది నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పెరుగు తినడం వల్ల ఆందోళనను తగ్గి మెదడుకు విశ్రాంతినిస్తుందని. అయితే నిద్రకు కనీసం రెండు నుండి మూడు గంటల ముందే భోజనం పూర్తీ చేయాలి.
పాలిచ్చే తల్లులు పెరుగు తినకూడదా?
పెరుగులో క్రియాశీల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. పెరుగు లేదా పెరుగులోని ప్రోబయోటిక్ మలబద్ధకం, అతిసారం నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడతాయి. తల్లి లేదా బిడ్డకు జలుబు లేదా దగ్గు రాకుండా చేస్తుంది.పెరుగు జీర్ణాశయ ఆరోగ్యానికి చాలా మంచిదని.
గర్భవతులు పెరుగు తినకూడదా?
గర్భిణీ స్త్రీలు తరచుగా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల చిన్న ప్రేగులలో జీర్ణక్రియకు పెరుగులోని బ్యాక్టీరియా అయిన లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ సహాయపడుతుంది. కాబట్టి గర్బవతులు వారి ఆహారంలో కనీసం రోజుకు ఒకసారి అయినా పెరుగును తీసుకోవచ్చు. అయితే ఆహారం బాగా జీర్ణం అయ్యే సమయం అయిన ఉదయం లేదా రాత్రి సమయాల్లో దీన్ని తీసుకోవడం మంచిది.
పెరుగు తింటే లావు అవుతారా?
పెరుగులో కొవ్వులు మాత్రమే కాకుండా కాల్షియం, విటమిన్ డి, పొటాషియం, ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది.
*రూపశ్రీ.