చెడిపోయిన వాళ్ళని చేరదీస్తున్న పవన్!
posted on Sep 20, 2024 @ 2:45PM
ప్రేమనగర్ సినిమాలో అక్కినేని నాగేశ్వర్రావు ఏమంటారంటే, ‘‘చెడిపోయినవాళ్ళని చేరదీశానే తప్ప, నేనెవర్నీ చెడగొట్టలేదు’’ అని. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే వుంది. రాజకీయాల్లో ఆయన ఇంతవరకు ఎవర్నీ చెడగొట్టకపోయినప్పటికీ, చెడిపోయినవాళ్ళని మాత్రం చేరదీస్తున్నారు. అలా చేరదీస్తూ తాను రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నానని అనుకుంటున్నారో ఏమోగానీ, ఆయన తన పార్టీని మాత్రమే కాకుండా, కూటమి ప్రభుత్వంలో వున్న ప్రశాంత వాతావరణాన్ని చేతులారా చెడగొట్టబోతున్నారన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వైసీపీ అవసానదశలో వుంది. ఆ పార్టీ అధికారంలో వున్నంతకాలం రాజభోగాలు అనుభవించినవారు ఇప్పుడు ఎప్పుడెప్పుడు వైసీపీని వదిలేసి కూటమిలోని ఏదో ఒక పార్టీని ఆశ్రయించాలా అని ఎదురుచూస్తున్నారు. వైసీపీ నాయకులను చేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎంతమాత్రం ఆసక్తి చూపించడం లేదు. బీజేపీలో చేరాలంటే, ఎప్పుడైనా బీజేపీకి తనకు ఉపయోగపడేవాళ్ళే కావాలితప్ప.. తనను ఉపయోగించుకునేవాళ్ళు అవసరం లేదు. అందువల్ల బీజేపీలో కూడా అవకాశాలు తక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ పునరావాసాన్ని కోరుకుంటున్న వాళ్ళకి ఆశాజ్యోతిలాగా జనసేన పార్టీ కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత కూడా చేతిలో పంచపాత్ర, ఉద్ధరిణి పట్టుకుని తన పార్టీ తలుపు తట్టినవాళ్ళకి ‘తీర్థం’ ఇస్తున్నారు. వాళ్ళని ఉద్ధరిస్తున్నారు. ఆ ఉద్ధరణ కార్యక్రమంలో భాగంగానే బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈనెల 22న బాలినేని, ఆయన అనుచరగణం మొత్తం జనసేనలో చేరబోతోంది.
జగన్ బంధువు, ఇంతకాలం ప్రకాశం జిల్లాలో జరిగిన అన్యాయాలు, అక్రమాలకు కేంద్రబిందువు. ఈ ఐదేళ్ళలో కబ్జాలతో కాకలు తీరిపోయారాయన. మొన్న జరిగిన ఎన్నికలలో ఆయన పార్టీతోపాటు ఆయన కూడా ఓడిపోయారు. వైసీపీలోనే వుంటే వచ్చే ఐదేళ్ళ వరకు ఆయనకి పనేమీ లేదు. పైగా ఆయన చేసిన అన్యాయాలు, అక్రమాల తాలూకు రియాక్షన్లు కూడా ఎదుర్కోవలసి వుంటుంది. ఈ ఐదేళ్ళు అధికార పార్టీలో వుంటే కేసుల గొడవ వుండదని అనుకున్నారో ఏమోగానీ, అధికారంలో భాగం పంచుకుంటున్న జనసేనలో చేరుతున్నారు. ఇలాంటి నాయకులను చేర్చుకోవడం వల్ల టీడీపీ - జనసేన పార్టీల మధ్య దూరం పెరిగే ప్రమాదం వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఐదేళ్ళపాటు ఆయన చేసిన తప్పులకు తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తే, రేపటి రోజున జనసేన ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం తమ పార్టీలో వున్నారు కాబట్టి క్షమించేసేయాలని అంటుందా? అవన్నీ గతంలో చేసిన నేరాలు కాబట్టి చూసీ చూడనట్టు ఊరుకుంటుందా? చట్టం ముందు దోషులుగా నిలబడేవాళ్ళని పార్టీలో చేర్చుకోవడం ఎందుకు... వాళ్ళు చేసిన నేరాల వల్ల ఇరుకున పడటం ఎందుకనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరడం అనే విషయాన్ని ఒక కోవర్ట్ ఆపరేషన్‌గా కొంతమంది అభివర్ణిస్తున్నారు. ఒక పథకం ప్రకారమే శ్రీనివాసరెడ్డిని జగన్ జనసేనకు పంపించారని అంటున్నారు. కీలక సమయంలో శ్రీనివాసరెడ్డి కూటమిలో వున్న ఐకమత్యాన్ని దెబ్బతీసేలా, కూటమి ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేలా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. మరి ఇన్ని మైనస్‌లు వున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని పవన్ కళ్యాణ్ ఎందుకు చేరదీస్తున్నారో మరి!