లబోదిబో మంటున్న అంజనీపుత్ర బాధితులు
posted on Apr 23, 2012 @ 11:36AM
అంజనీపుత్ర ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థ అనేకమందిని నట్టేట ముంచింది. ఈ సంస్థ మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడా, కల్వకోల్ గ్రామాల పరిథిలో సుమారు వందెకరాల్లో వెంచర్ వేసింది. అంజనీపుత్ర ఫేజ్ - 1లో విల్లాలు, డూప్లెక్స్ లు కట్టబోతున్నట్లు ప్రచారం చేయటంతో అనేకమంది లక్షలాజ్ది రూపాయలు అడ్వాన్సులు ఇచ్చారు. ఈ వెంచర్ కు ప్రముఖ సినీనటి జెనీలియా కూడా ప్రచారం చేయటంతో వ్యాపారం బాగా జరిగింది.
ఇక్కడి దాకా బాగానే ఉంది. తరువాత రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోవటం, నిర్మాణవ్యయం పెరగటం, భాగస్వాముల్లో విభేదాల వల్ల వెంచర్ మధ్యలోనే నిలిచిపోయింది. దాదాపు 200 డూప్లెక్స్ లకు, 100 విల్లాలకు కోట్లాది రూపాయలు అడ్వాన్సులుగా తీసుకున్నారు. 200 డూప్లెక్స్ లకు గాను, ఐదు ఇళ్ళకు మాత్రమే శ్లాబులు వేశారు. విల్లాలకు పిల్లర్లు మాత్రమే వేశారు. దీనికి తోడు రైతుల నుంచి అగ్రిమెంట్లు చేసుకున్న భూములకు డబ్బులు పూర్తిగా చెల్లించలేదు. దీంతో రైతులు తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని పంటలు వేస్తున్నారు. వెంచారు నిర్వాహకుల ఆచూకీ లేకపోవటంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ నగరంలో ఇలా అర్థాంతరంగా ఆగిపోయిన వెంచర్లు అనేకం ఉన్నాయని తెలుస్తోంది.