Read more!

బాబూమోహన్ దిక్కులేని రాజకీయాలు!

అందుకే ఆయన రాజకీయంగా ఆయన పరిస్థితి దిక్కుమాలిన స్థితికి చేరుకుంది. గురువారం నాడు వరంగల్ పార్లమెంట్ స్థానానికి వీల్ చైర్లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతకీ మీరు నామినేషన్ వేసింది ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగానేగా అని అడిగితే, ‘ఛ.. ఛ.. ఆ పార్టీలో నేనెనెప్పుడు చేరాను? కాఫీ తాగుదువుగాని రా అని కేఏ పాల్ పిలిస్తే వెళ్ళాను. ఆయన నాకు కండువా కప్పి వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. కానీ నేను ఆ పార్టీలో చేరలేదు.. ఆ పార్టీ సభ్యుణ్ణి కూడా కాదు. ఆ పార్టీకి ఆరోజే టాటా చెప్పేశాను. స్థానిక ప్రజలు నన్ను నా స్వస్థలమైన వరంగల్ నుంచి పోటీ చేయాలని రిక్వెస్ట్ చేయడంతో నామినేషన్ దాఖలు చేశాను’ అని చెప్పుకొచ్చారు.

నిజానికి బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నానని కె.ఎ.పాల్‌తో కలసి ప్రకటించారు. అప్పటి వరకు తాను వున్న బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్టు కూడా ప్రకటించారు. మధ్యలో ఓసారి వరంగల్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాబూమోహన్ బరిలో నిలిచే అవకాశం వుందని వార్తలు వచ్చినప్పుడు బాబూమోహన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తన పేరును బీఆర్ఎస్ పార్టీ ఇలా వాడుకుంటే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు. నిజంగానే బీఆర్ఎస్ ఈయనకు టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్టే బిల్డప్పు ఇచ్చారు. చివరికి ఇప్పుడు ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ బాబూమోహన్‌కి పిలిచి మరీ అందోల్ టిక్కెట్ ఇచ్చింది. మంత్రి పదవి కూడా కట్టబెట్టింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో వున్న సమయంలో బాబూమోహన్ నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి బయటకి వచ్చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలో కొంతకాలం కేసీఆర్‌తో స్నేహబంధం కొనసాగించారు. ఎప్పుడైతే కేసీఆర్ తనను దూరం పెట్టడం ప్రారంభించారో, పొమ్మనలేక పొగపెట్టడం మొదలుపెట్టారో బాబూమోహన్ పార్టీకి క్రమంగా దూరమవుతూ, చివరికి పార్టీలో నుంచి బయటకి వచ్చేశారు. ఈసారి మకాం బీజేపీలో వేశారు. మొన్నటి ఎన్నికలలో అందోల్ టిక్కెట్ కోసం తన కొడుకుతోనే గొడవపడి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీకి చేరువై, ఆ తర్వాత దూరమై ఇప్పుడు ఇండిపెండెంట్‌గా మిగిలి, తనకు రాజకీయంగా కొత్త అయిన వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. రాజకీయంగా తన కెరీర్ ముగిసిన విషయాన్ని బాబూమోహన్ ఇంకా గ్రహించలేదు. ఏడుపదులు దాటిన బాబూమోహన్ ఇక రాజకీయాలకు స్వస్తి పలికి విశ్రాంతి బాటలో నడిస్తే బాగుంటుంది!