ఎమ్మెల్యే నివాసం ఎదుట అయ్యప్ప స్వాముల భజన నిరసన
posted on Nov 7, 2022 5:08AM
భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో పూజలు భజనలు చేసుకునే అయ్యప్పస్వాములే నిరసనకు దిగాల్సిన పరిస్థితిని వైసీపీ సర్కార్ తీసుకువచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను బద్ధ శత్రువుల్లా చూసే జగన్ సర్కార్ నైజమే ఇందుకు కారణమన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.
ఇంతకూ జరిగిందేమిటంటే..భీమవరంలోని సింహాద్రి అప్పన్న దేవాలయం వద్ద గత 28 ఏళ్లుగా అయ్యప్పమాల ధరంచే వారు పడిపూజ చేసుకుంటారు. సంప్రదాయంగా వస్తున్న ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎవరూ జోక్యం చేసుకోలేదు. కానీ తాజాగా అయ్యప్ప మాల వేసుకున్న జనసేన మద్దతుదారు పడిపూజను అడ్డుకోవాల్సిందిగా ప్రభుత్వ అధికారుల్ని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆదేశించారు.
దాంతో పోలీసులు, అధికారులు రంగ ప్రవేశం చేసి అప్పటికే షామియానా వేసి.. పూజా కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న వేళ అడ్డుకున్నారు. అయ్యప్ప మాలలో ఉన్న వారు భక్తిభావంతో చేసే కార్యక్రమాన్ని రాజకీయంగా ఎలా చూస్తారని అయ్యప్పలు నిలదీశారు.
ఎమ్మెల్యేను అడిగితే ఇప్పుడు ఇంతే అని నిర్లక్షంగా సమాధానమిచ్చారు. దీంతో అయ్యప్పలకు ఆగ్రహం వచ్చింది. ఎమ్మెల్యే తీరుకు నిరసనగాద శనివారం రాత్రి ఆయన నివాసం ముందు రోడ్డుపై కూర్చుని అయ్యప్ప గీతాలు పాడుతూ, భజన చేస్తూ నిరసనకు దిగారు. అయ్యప్పల నిరసనలకు స్థానికులు కూడా మద్దతు ఇస్తూ ఎమ్మెల్యే తీరును తప్పుపట్టారు.