ధర్మానకు ఇప్పటికి తెలిసొచ్చింది.. అయినా బలే కవర్ చేశారుగా?
posted on Nov 8, 2022 @ 1:18PM
మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సీనియర్ రాజకీయ నాయకుడు. మంత్రి కూడా. ఆయనకు ఇన్నాళ్లకు ఒక విషయం అర్ధమైంది. అదేంటంటే తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని. గడపగడపకూలో ఎదురౌతున్న నిరసనలు, మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా ఎదురైనా చేదు అనుభవాలు ఏవీ కూడా ఆయనకు ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రతీకలుగా కనిపించలేదట. తమ అధినేత చెప్పిన విధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీసీ 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించేస్తుందన్న నమ్మకాన్నే ఇంత కాలం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
వీటన్నిటికీ మించి మూడు రాజధానులకు అనుకూలంగా చేపట్టిన విశాఖ గర్జనకు జనం మొహం చాటేసినా, ఇదే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశాల్లో, రౌండ్ టేబుల్ సదస్సుల్లో మూడు రాజధానులకు అనుకూలంగా వాణి వినిపించకపోయినా ధర్మానకు ప్రజా వ్యతిరేకత కనిపించలేదు. పై పెచ్చు మూడు రాజధానులకు అనుకూలంగా తాను కోరినా గట్టిగా గళం విప్పలేదని జనంపై చిర్రుబుర్రులాడారు కూడా.
జనం అంతా జగన్ వెనకే ఉన్నారని చాలా ధీమాగా చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి ధర్మానకు హఠాత్తుగా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపించేసింది. వెంటనే ఆయనా మాట తనలో దాచుకోకుండా శ్రీకాకుళంలో మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పేశారు. ‘ఔను.. మా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది’ అంటూ కుండబద్దలు కొట్టేశారు. అయితే ఆ వ్యతిరేకత అంతా ప్రభుత్వ విధానాలను ప్రజలు అర్ధం చేసుకోకపోవడం వల్లనే వచ్చిందని తనదైన శైలిలో కవరింగ్ ఇచ్చేశారు.
ఏ ప్రభుత్వానికైనా సరే సంస్కరణలు చేపట్టినప్పుడు తొలుత ప్రజా వ్యతిరేకతక రావడం సహజమేనని సూత్రీకరించారు. ఇప్పుడు జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు కూడా ఆయన అమలు చేస్తున్న సంస్కరణలు ప్రజలకు అర్ధం కాకపోవడం వల్లనేనని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఏపీలో జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయలో ఉందని మంత్రి ధర్మాన స్వయంగా అంగీకరించేశారు. ఆయనే స్వయంగా తమ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని అంగీకరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ధర్మన వాస్తవం అంగీకరించేశారని జనం అంటున్నారు.